గెలుపే లక్ష్యం..!
– సర్వేలన్నీ బీఆర్ఎస్‌కే అనుకూలం
– పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
– బీజేపీ వాళ్లు ఏం చేస్తారో చూద్దాం..
– తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్దేశం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో సర్వేలన్నీ బీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని, అయినా గెలుపే లక్ష్యంగా అందరు పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో భారాస అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నికలకు పార్టీ నేతలంతా సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు అమలు చేస్తోందని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మరింత చొరవ చూపాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. త్వరలో వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. పార్టీలోని అన్ని స్థాయిల నేతలను కలుపుకొని వెళ్లాలని ముఖ్యనేతలకు సూచించారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కూడా సమావేశంలో సీఎం కేసీఆర్ వివరించారు. గృహలక్ష్మి పథకం ద్వారా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు, దళితబంధు, రెండో విడత గొర్రెల పంపిణీ సహా ప్రభుత్వ పథకాలన్నింటినీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలు పనిచేయాలని సూచించారు. ఏటా తెరాస ఆవిర్భావం సందర్భంగా పార్టీ ప్లీనరి నిర్వహించే వారు. ఇకపై భారాస ఆవిర్భావం రోజే పార్టీ ప్లీనరి నిర్వహించాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్టు సమావేశంలో వెల్లడించారు. పాదయాత్రలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని, నేతలంతా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయన్న సీఎం కేసీఆర్.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఏడాది డిసెంబరులోపు అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావాల్సిన నేపథ్యంలో.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారాస విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
బీజేపీ వాళ్లు ఏం చేస్తారో చూద్దాం..
ఎమ్మెల్సీ కవితకు ఈడీ అందించిన నోటిసులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెడుతోందని పేర్కొన్నారు. కవితకు నోటీసులు ఇచ్చారు.. ఏం చేస్తారో చూద్దామంటూ వ్యాఖ్యానించారు. ‘కేంద్రంలోని బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతోంది. ఆ కారణంగానే రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో పాటు కవిత వరకు వచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు నోటీసులు ఇచ్చారు.. ఏం చేస్తారో చూద్దాం, ప్రజాస్వామ్య, న్యాయబద్దంగానే ఎదుర్కొందాం. బీజేపీని ఇంటికి పంపడంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించాలి.

