తాండూరు కందికి మరో అరుదైన గౌరవం

ఆరోగ్యం తాండూరు తెలంగాణ వికారాబాద్

తాండూరు కందికి మరో అరుదైన గౌరవం
– అంతర్జాతీయ ఆహార ఉత్పత్తుల ప్రదర్శనలో చోటు
– తెలంగాణ నుంచి ఏకైక ఉత్పత్తిగా ఎంపిక

తాండూరు, దర్శిని ప్రతినిధి : భౌగోళిక గుర్తింపును సొంతం చేసుకున్న తాండూరు కందికి మరో అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ ఆహార ఉత్పత్తుల ప్రదర్శనలో తాండూరు కందికి చోటు దక్కింది. మంగళవారం నుంచి ఈనెల 18వ తేది వరకు దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ ఆహార ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక వ్యవసాయ ఉత్పత్తిగా తాండూరు కంది ప్రదర్శనకు అనుమతి లభించింది. ఈ మేరకు ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన ఆహార ఉత్పత్తుల ప్రదర్శనలో తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి యాలాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు గుర్రాల శ్రీనివాస్ రెడ్డి, షేర్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు మరాఠి నర్సింలు పాల్గొని తాండూరు కందిపై ప్రదర్శన ఇచ్చారు. దీంతో పాటు ఇటీవల తాండూరు కందికి అందించిన జీఐ గుర్తింపు పురస్కారాన్ని కూడ ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో తాండూరు కంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.సి.సుధారాణి తెలిపారు.