రైత‌న్న‌కు శుభ‌వార్త – ర‌బీ సీజ‌న్ పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధర పెంపు

జాతీయం తెలంగాణ

రైత‌న్న‌కు శుభ‌వార్త
– ర‌బీ సీజ‌న్ పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధర పెంపు
– ఓకే చేసిన కేంద్ర కేబినెట్ క‌మిటి
ద‌ర్శిని బ్యూరో : కేంద్ర ప్ర‌భుత్వం రైతుల‌కు శుభ‌వార్త‌ను తెలిపింది. రబీ పంటలకు కనీసం మద్దతును పెంచుతూ.. తీసుకున్న నిర్ణ‌యానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో ఈ రబీ సీజన్ లో పంటలు వేసే రైతులందరికీ వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది.

దేశంలో 2022-23 మార్కెటింగ్ సీజ‌న్‌లో అధీకృత రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను పెంచే ప్రతిపాదనపై ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఇవాళ సమావేశమైంది. ఆయా పంటలు సాగుచేసిన రైతులకు దిగుబడిపై గిట్టుబాటు ధర లభ్యతపై భరోసా ఇస్తూ 2022-23 మార్కెటింగ్ సీజ‌న్‌కుగాను ప్రభుత్వం రబీ పంటల కనీస మద్దతు ధరపై ఆమోద ముద్ర వేసింది. గ‌త యేడాదితో పోలిస్తే కేంద్ర కేబినెట్ పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌ను అత్యధికంగా పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. పంటల సాగులో వైవిధ్యం దిశగా రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించింది కేంద్రం.

మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌ను పునర్వ్యవస్థీకరించడానికి గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత సంవత్సరం కంటే మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌లో అత్యధిక పెరుగుదల కాయధాన్యాలు (మసూర్) , రేప్‌సీడ్‌లు, ఆవాలు పంటకు ప్రతి క్వింటాల్‌కు రూ. 400 చొప్పున మద్దుతు ధర లభించనుంది. ఇక, క్వింటాల్ చెరకు మద్దతు ధర రూ. 290 ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే, గోధుమలపై రూ.40, బార్లీ రూ.35 , శనగలపై రూ.350 మద్దతు ధర పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇక, పెరిగిన ధరలతో క్వింటాల్ గోధుమలకు రూ. 2015 మద్దతు ధర లభించనుంది. ఇక పెంచిన ధరలతో దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కాస్త ఊరట లభించనుంది. ముఖ్యంగా గోధుమలు, బార్లీ, శనగలు, చెరకు, ఆవాలు లపై కనీస మద్దతు ధరలు పెంచిన కేంద్రం.. 2022 – 23 మార్కెటింగ్ సీజన్‌కు ఈ కొత్త కనీస మద్దతు ధరలు వర్తింపచేయనుంది. అన్నదాతల ఆదాయాన్ని పెంచడం, అదనపు ఉపాధిని కల్పించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర సర్కార్ భావిస్తోంది.