ట్రైన్‌లో నుంచి ఫోన్‌, వస్తువులు పడిపోతే..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

ట్రైన్‌లో నుంచి ఫోన్‌, వస్తువులు పడిపోతే..!
– ఇలా చేస్తే తిరిగి పొందవచ్చు
– ఏం చేయాలో తెలుసుకోండి
దర్శిని డెస్క్‌: ప్రయాణ సమయాల్లో కదులుతున్న రైల్లో నుంచి చాలా మంది ప్రయాణికులు తమ సెల్‌ ఫోన్లు గాని, ఇతర వస్తువులు గాని పడిపోవడం జరుగుతుంటాయి. చాలాసార్లు ప్రయాణికుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణిస్తున్న సమయంలో రైలు నుంచి మొబైల్, పర్సు, వాచ్ వంటి విలువైన వస్తువులు పడిపోతుంటాయి. పోయిన వస్తువులు తిరిగి పోందలేక బెంగపడిపోతుంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు భారతీయ రైల్వే కొన్ని సౌకర్యాలను కల్పించింది. దీని సహాయంతో మీరు కోల్పోయిన వస్తువును తిరిగి పొందవచ్చు. మరి పోగొట్టుకున్న వస్తువులను ఎలా తిరిగి పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇలా చేస్తే సరిపోతుంది..
ముందుగా మీరు ట్రాక్ పక్కన ఉన్న పోల్‌పై పసుపు, నలుపు రంగులలో వ్రాసిన నంబర్‌ను నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఫోన్, వస్తువు ఏ రెండు రైల్వే స్టేషన్ల మధ్య పడిపోయిందో గమనించాలి. ఇతరుల ఫోన్ తీసుకుని రైల్వే పోలీస్ ఫోర్స్ హెల్ప్‌లైన్ నంబర్ 182 లేదా రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కాల్ చేసి, మీ పోయిన ఫోన్, లగేజీ గురించి కంప్లైంట్ ఇవ్వాలి. అదే సమయంలో మీరు గుర్తించిన పోల్ నంబర్‌ను RPFకి ఇవ్వాలి. ఈ పోల్ నంబర్ మీ వస్తువులను, ఫోన్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది. పోల్ నంబర్ సహాయంతో పోలీసులు మీరు పేర్కొన్న ప్రదేశానికి చేరుకుంటారు. మీ మొబైల్ ఫోన్, పర్సు లేదా వాచ్ కనుగొంటారు. పోలీసులు ప్రయత్నం మాత్రమే చేస్తారనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. పోయిన వస్తువులు ఖచ్చితంగా దొరుకుతాయని పోలీసులు హామీ ఇవ్వలేరు. అంటే, ఈలోగా ఎవరైనా మీ లగేజీని ఎత్తుకెళితే పోలీసులు ఏమీ చేయలేరు.