పాస్ చేయించాలని చీటింగ్..!
– అడ్డంగా దొరికి ఫేయిల్ అయిన పంతుళ్లు
– వాట్సాప్‌లో ప్రశ్నాప్రత్రంలో ఇద్దరు టీచర్ల రిమాండు
– వెల్లడించిన తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులను పాస్ చేయించేందుకు చీటింగ్ చేయాలని యత్నించిన ఇద్దరు టీచర్ల ప్లాన్ ఫేయిల్ అయ్యింది. తొందరపాటు చర్యలో అడ్డంగా దొరికి జైలుకు పాలు అయ్యారు. వాట్సాప్ లో పదో తరగతి ప్రశ్నాపత్రంను ప్రత్యక్షం అయిన ఘటనలో ఇద్దరు టీచర్లు జైలుపాలు అయ్యారు. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తాండూరు పట్టణంలోని పదో తరగతి పరీక్షా కేంద్రం ప్రభుత్వ నెంబర్1 పాఠశాల నుంచి పదో తరగతి ప్రశ్నాపత్రం వాట్సాప్ లో ప్రత్యక్షం అయిన సంగతి తెలిసిందే.
ఈ పరీక్షా కేంద్రంలో రిలీవర్ గా ఉన్న బందెప్ప తన ఫోన్ నుంచి ప్రశ్నాపత్రంను ఫోటో తీసి చెంగోల్ జెడ్పీహెచ్ఎస్ లో పనిచేస్తున్న ఎన్.సమ్మప్ప అనే మరో టీచర్కు పంపించినట్లు గుర్తించారు. బందెప్ప, సమ్మప్పలు ఇద్దరు స్నేహితులని పోలీసుల విచారణలో తేలింది. సమ్మప్పకు ఇన్విజిలేటర్ డ్యూటీ లేకపోవడంతో రిలీవర్ డ్యూటీలో ఉన్న బందెప్ప ద్వారా క్వశ్చన్ పేపర్ తెప్పించుకుని వారిద్దరికి తెలిసిన విద్యార్థులకు చిట్టీలు అందించాలని పథకం వేసుకున్నారు. ఇందులో భాగంగా బందెప్ప తాను విధుల్లో ఉన్న పరీక్షా కేంద్రంలో 5 నెంబర్ గదిలో పరీక్షకు గైర్హాజరు అయిన విద్యార్థికి సంబంధించి ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసి సమ్మప్పకు పంపాడు. అదే తొందరపాటులో ఫోటోలు ఓ వాట్సాప్ గ్రూపులో పంపాడు.
వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం ప్రత్యక్షం కావడం వైరల్‌గా మారింది. అంతకుముందే వాట్సాప్ లో వచ్చిన ప్రశ్నాపత్రం ఆధారంగా సమ్మప్ప వీజీఎస్ గైడ్ నుంచి ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు సమాధానాలను చింపి తాండూరులోని విద్య బుక్ సెంటర్ అండ్ జిరాక్స్ షాపు నిర్వహిస్తున్న శివ అనే వ్యక్తి వద్ద మైక్రో జిరాక్స్ చేయించేందుకు యత్నించాడు. అప్పటికే ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో నెంబర్ 1 స్కూల్ నుంచి ప్రశ్నాపత్రం ప్రత్యక్షం అయ్యిందనే పుకారు రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. మండల విద్యాధికారి ఫిర్యాదు మేరకు చీటింగ్ చేసేందుకు యత్నించిన బందెప్ప, సమ్మప్పలకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ చేసినట్లు సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. మరోవైపు జిరాక్స్ సెంటర్ యజమాని శివ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

