విద్యార్థులపై వార్డెన్ వివక్ష సహించం
– ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టకపోవడం దుర్మార్గం
– నిర్లక్ష్య వార్డెన్లపై బీసీ కమిషనరేట్ లో ఫిర్యాదు చేస్తాం
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆకలి అన్న విద్యార్థులకు భోజనం పెట్టని వసతి గృహ వార్డెన్ వైఖరిని సహించేది లేదని, ఆమెపై చర్యలు తీసుకోవాలని బీసీ సంఘం జాతీయ కార్యకవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ బషీరాబాద్ మండలం బీసీ బాలికల వసతి గృహంలో బాలికలు అరగంట ఆలస్యంగా లేచారని హాస్టల్ వార్డెన్ భోజనం నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలీచాలని వసతులతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వసతి గృహాల్లోకి ఉంటున్నారని, వారి తల్లిదండ్రులు విద్యార్థులను సంక్షేమ హాస్టల్లో చేర్పిస్తుంటే విద్యార్థులకు సమయానికి భోజనాన్ని అందించకపోవడం దుర్మార్గమని అన్నారు. విద్యార్థులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హాస్టల్ వార్డెన్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత తాండూరు లో ఉన్న అసిస్టెంట్ బీసీ కార్యాలయాన్ని ఎత్తివేయడంతో పలు హాస్టల్లో వార్డెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు తాండూరు పట్టణంలో వెంటనే ఏబిసిఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాండూర్ నియోజకవర్గం లో ఉన్న హాస్టల్లో పరిస్థితులను, వార్డెన్, సిబ్బందిల నిర్లక్ష్య వైఖరిని జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో పాటు బీసీ కమిషనరేట్ లో కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు.

