మూడు పార్టీలకు జాతీయ హోదా రద్దు
– షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఈసీ
– మరో పార్టీకి జాతీయ హోదా
దర్శిని డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. భారత దేశంలో ఉన్న మూడు పార్టీలకు జాతీయ హోదా రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఎన్నికల సంఘం నిర్ణయంతో దేశంలోని టీఎంసీ, సీపీఐ, ఎన్సీపీ పార్టీలు జాతీయ పార్టీ హోదాను కోల్పోయాయి. ప్రస్తుతం దేశంలో 1. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2. భారతీయ జనతా పార్టీ 3. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా – సీపీఐ (ఇప్పుడు గుర్తింపు కోల్పోయింది) 4. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) – సీపీఎం 5. తృణమూల్ కాంగ్రెస్ (ఇప్పుడు గుర్తింపు రద్దు) 6. బహుజన్ సమాజ్ పార్టీ 7. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఇప్పుడు గుర్తింపు రద్దు) 8. నేషనల్ పీపుల్స్ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) పార్టీల జాతీయ హోదాను ఈసీ ఉపసంహరించుకున్నది. వాస్తవానికి ఓ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే దేశంలో కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు సాధించాలి. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లేదంటే లోక్‌సభ ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఈ మేరకు ఓట్లైనా వచ్చి ఉండాలి.
నాలుగు ఎంపీ సీట్లను సైతం గెలవాలి. లేదంటే దేశవ్యాప్తంగా జరిగే లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో కనీసం రెండు శాతం స్థానాల్లో విజయం సాధించి ఉండాలి. ఈ రెండుశాతం సీట్లు కూడా మూడు రాష్ట్రాల నుంచి గెలవాలి. ఒక ప్రాంతీయ పార్టీగా కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్నా జాతీయ పార్టీగా గుర్తిస్తారు. అయితే, మూడు పార్టీల జాతీయ హోదా రద్దవగా.. కొత్తగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా దక్కింది. అదేవిధంగా త్రిపురలో తిప్ర మోత పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. BRS ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

