చెప్పకుండా వెళ్లి.. చెరువులో దూకి..!

క్రైం తాండూరు వికారాబాద్

చెప్పకుండా వెళ్లి.. చెరువులో దూకి..!
– మతి స్థిమితం లేని బాలిక మృతి
– యాలాల మండలంలో విషాధం
– కన్నీళ్లు పెట్టించిన సంఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: మతిస్థిమితం సరిగ్గాలేని ఓ పదహారేళ్ల బాలిక ఇంట్లో చెప్పకుండా వెళ్లింది. ఏమనుకుందో తెలియదు కాని గ్రామ సమీపంలోని ఓ చెరువులో దూకి మరణించింది. ఈ విషయం తెలిసిన కుటుంభీకులు తిరిగిరాకుండా వెళ్లిపోయావా తల్లీ అంటూ రోధించిన తీరు స్థానికులను కన్నీళ్లు పెట్టించింది. ఈ విషాధకర సంఘటన వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం అగ్గనూర్ పంచాయతీ మల్‌రెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. యాలాల ఎస్ఐ అరవింద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అంజయ్య, శారదమ్మల కూతురు శిరీష(16) అగ్గనూర్ గ్రామ పాఠశాలలో చదువుతుండేది. గత ఏడాది 9వ తరగతి పూర్తి చేసింది. ఈ ఏడాది పదోతరగతి కూడ చదివింది.

అయితే కొంత కాలంగా శిరీష మతిస్థిమితం కోల్పోయింది. ఈ నేపథ్యంలో పాఠశాలకు వెళ్లడం మానేసింది. అప్పుడప్పుడు ఇంట్లో చెప్పకుండా వెళ్లే శిరీష తిరిగి ఇంటికి వచ్చేసేది. మంగళవారం ఇంటి నుంచి వెళ్లిన శిరీష రాత్రయినా ఇంటికి తిరిగిలేదు. దీంతో కుటుంబీకులు యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గ్రామ సమీపంలోని ఓ చెరువులో బాలిక దూకినట్లు అనుమానంగా ఓ పశువుల కాపరి తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని తాండూరు ఫైర్ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చెరువులోతు ఎక్కువగా ఉండడంతో ఫలితం లేకుండా పోయింది. బుధవారం కోట్‌పల్లి నుంచి గజ ఈతగాళ్ల సహాయంతో మళ్లీ గాలింపు చేపట్టగా శిరీష మృతదేహాన్ని వెలికి తీశారు. శిరీష మృతదేహాన్ని చూసిన కుటుంభీకులు బోరున విలపించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ అరవింద్ తెలిపారు.