రెండు చోట్ల ఓటున్న వారికి నోటీసులు
– కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం
– కార్డుదారులపై ఎలాంటి చర్యలు ఉంటాయంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాల్లో, గ్రామాల్లో ఒకే వ్యక్తి రెండు ఓటరు కార్డులు కలిగి ఉండడంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టిసారించింది. రెండింటిలో బోగస్ కార్డులను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో రెండో విడతలో బోగస్ ఓట్లు తొలగించేందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా పలు జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే పేరు- ఒకే ఫొటోతో రెండు ఓటు హక్కు ఉన్న వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో తొలి విడతలో ఒకే నియోజకవర్గంలో ఒకటికి మించి ఓటు ఉన్న 22 లక్షల మందిని ఎన్నికల సంఘం గుర్తించింది. ¸పేర్కొన్న చిరునామాల్లో ఉండని 10.40 లక్షల ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఇప్పటికే రాష్ట్రంలో 12.56 లక్షల మంది ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది.
రెండు చిరుమానాల్లో లేకపోతే..
రెండు కార్డులు కలిగి ఉన్న వారి వివరాలతో నియోజకవర్గాల వారీగా ఇచ్చిన జాబితాలపై క్షేత్రస్థాయి అధికారులు పరిశీలన పూర్తిచేశారు. వీరందరికీ నోటీసులు జారీ చేసి.. ఏ నియోజకవర్గంలో ఓటు హక్కు కొనసాగించాలనుకుంటున్నారు? ఎక్కడ వద్దనుకుంటున్నారన్న దానిపై వారి నుంచి ధ్రువపత్రం తీసుకోనున్నారు. ఆ తర్వాత తొలగింపు చర్యలు చేపడతారు. రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉండి.. ఏ చిరునామాలోనూ ఉండని వారి ఓట్లను పూర్తిగా జాబితా నుంచి తొలగిస్తారు. ఎన్నికల సంఘం పంపిన 12.56 లక్షల ఓటర్లలో సుమారు 7 లక్షలకుపైగా తొలగింపు జాబితాలో ఉంటాయని క్షేత్రస్థాయి అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు విడతల్లో కలిపి సుమారు 18 లక్షల బోగస్ ఓట్లను తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఓటరు కార్డుల దారులకు నోటీసుల జారీ కార్యక్రమాన్ని ఈ నెల చివరలో ప్రారంభించనున్నారని సమాచారం.

