దిగి వస్తున్న వంటనూనే ధరలు

జాతీయం తెలంగాణ హైదరాబాద్

దిగి వస్తున్న వంటనూనే ధరలు
– కేంద్రం నిర్ణ‌యంతో త‌గ్గుద‌ల‌
ద‌ర్శిని ప్ర‌తినిధి: ఆకాశాన్నంటిన వంట నూనె ధరలు నెమ్మ‌దిగా దిగివస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి పన్ను తగ్గించడంతో ప్రస్తుతం కిలో ఆయిల్‍ ప్యాకెట్‍పై దాదాపు 15 నుంచి 20 శాతం వరకు రేట్లు తగ్గుముఖం పట్టాయి. ముడి పామాయిల్‌పై ఉన్న 10% దిగుమతి సుంకాన్ని 2.5 శాతానికి, ముడి సోయాబీన్‌ ఆయిల్, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై ఉన్న 7.5% సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించారు. సామాన్యుడి బాధలపై ఫోకస్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. దేశంలో పెరిగిన వంట నూనెల ధరలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. ఇక అన్ని రకాల రిఫైన్డ్‌ ఆయిల్స్‌ ఉన్న దిగుమతి సుంకాన్ని 37.75% నుంచి 32.5 శాతానికి కుదించారు. తాజా తగ్గింపు నేపథ్యంలో ముడి నూనెలపై దిగుమతి సుంకంతో కలుపుకొని మొత్తం పన్నులు 24.75 శాతానికి తగ్గనున్నాయి. దీంతో రిఫైన్డ్‌ ఆయిల్స్‌పై ఉన్న పన్ను 35.75 శాతానికి చేరుకోనున్నాయి. దేశవ్యాప్తంగా నాలుగైదు నెలలుగా పేదవాడికి అందనంత ఎత్తుకు ఎదిగి చుక్కలు చూపెట్టిన వంటనూనె ధరలు కొద్దికొద్దిగా తగ్గుతున్నాయి. కరోనా ఎఫెక్ట్​తో ఎన్నడూ లేని విధంగా ధరలు 70 నుంచి 90 శాతం వరకు పెరిగాయి. ఏప్రిల్‍ నెలలో కిలో సన్‍ఫ్లవర్‍ ఆయిల్‍ రూ.90 నుంచి రూ.100 ఉండగా.. ఒక్కసారిగా రూ.180కి చేరింది. ఇదే లెక్కన పామాయిల్‍, సోయా, ఆవనూనె, వేరుశనగ ధరలు సైతం అలానే ఆకాశాన్నంటాయి. దేశంలో నూనె గింజల దిగుబడి తగ్గడానికి తోడు కరోనా ప్రభావమే కారణంగా వ్యాపారులు చెప్పుకొచ్చారు. మామూలుగా మన దేశం మలేషియా, ఇండోనేషియాల నుంచి పామాయిల్‍, బ్రెజిల్‍, రష్యా, అర్జెంటినా వంటి దేశాల నుంచి సన్‍ ఫ్లవర్‍ ఆయిల్‍ను దిగుమతి చేసుకుంటుంది.