సొంతింటి కలకు చేరువలో..!
– డబుల్ అర్హుల దరఖాస్తుల వడబోత
– అర్హుల జాబితాను ప్రదర్శించేందుకు కసరత్తు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎన్నో ఏండ్లుగా సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్న పేదలు దానిని నిజం చేసుకునేందుకు చేరువలో ఉన్నారు. వికారాబాద్ జిల్లాలోని డబుల్ బెడ్ రూం అర్హుల ఎంపిక ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ కోసం అధికారులు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. గత మార్చి నెలాఖరులో తాండూరు పట్టణంలోని 36 వార్డుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఆయా వార్డుల నుంచి 9436 మంది డబుల్ ఇండ్ల కోసం దరఖాస్తులు సమర్పించుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు దరఖాస్తులపై అర్హులను తేల్చేందుకు ఇంటింటి విచారణ చేపట్టారు. 147 మందితో కూడిన ప్రత్యేక బృందాల ద్వారా ఈ విచారణ కొనసాగింది.
ఈ క్రమంలోనే 9436 మంది దరఖాస్తులలో 3 వేలకు పైగా అనర్హులు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. ప్రస్తుతం తాండూరు తహసీల్దార్ ఆధ్వర్యంలో డబుల్ దరఖాస్తుల అర్హుల వడబోత ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటి వరకు 50 శాతం పూర్తయ్యింది. ఈ జాబితాను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఈ తతంగం పూర్తయిన వెంటనే డబుల్ ఇండ్ల అనర్హుల జాబితాను ప్రదర్శించేందుకు కసరత్తు చేస్తున్నారు. అర్హులను గుర్తించిన తరువాతే లాటరీ విధానంలో వారిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ సెలవులో ఉన్నారు. కలెక్టర్ విధుల్లో చేరిన తరువాత ఆయన నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు.

