ఒకే కాన్పులో ముగ్గురు

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

ఒకే కాన్పులో ముగ్గురు
– మగ పిల్లలకు జన్మనిచ్చిన తల్లి
– తాండూరు నియోజకవర్గంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఒకే కాన్పులో ఓ తల్లి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధి నాగులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ బాల రాజుకు తాండూరు మండలం ఉద్దండాపూర్‌కు చెందిన మమతతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇది వరకే మమతకు మొదటి కాన్పులో ఇద్దరు మగ కవలలు జన్మించి.. కొన్ని నెలలకే చనిపోయారు. ఆ తరువాత రెండో కాన్పులో మమత ఓ ఆడపిల్ల జన్మనిచ్చింది. తాజాగా నెలలు నిండిన మమతకు సోమవారం పురిటి నొప్పులు రావడంతో భర్త బాలరాజు కుటుంబ సభ్యులతో కలిసి తాండూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

పరిశీలించిన వైద్యులు ఆమెకు సీజరియన్ చేసి మూడో కాన్పు చేశారు. మూడో కాన్పులో మమత ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చింది. తల్లీ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు భర్త బాల రాజు చెప్పారు. ప్రస్తుతం తల్లీ బిడ్డలను తాండూరు మండలం . ఉద్దండాపూరులో ఆమె పుట్టింట్లో తల్లి వద్ద ఉంచామన్నారు. అయితే కూలీ పనులు చేసుకుని జీవించే తమకు పిల్లల పిల్లల పోషణ భారంగా ఉందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.