చెట్టులో దాగిన డబ్బుల మూట..!
– గుట్టుగా దాచినా.. ఐటీ తనిఖీల్లో రట్టు
– కర్ణాటక ఎన్నికల్లో విచిత్ర సంఘటన
– సోషల్ మీడియాలో వైరల్
దర్శిని డెస్క్: డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా.. అనే ఊత పదం.. నిజమే అన్నట్లుగా కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. చెట్టులో దాచిన డబ్బు గుట్టు ఐటీ తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్రవిచిత్ర ఘటన చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో మే 10 న ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు హోరా హోరీ ప్రచారాలు చేసుకుంటున్నారు. కొంత మంది డబ్బులు పంచే ప్రలోభాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఐటీ అధికారుల విస్తృతంగా దాడులు నిర్వహించారు. మైసూర్‌లోని ఓ రాజకీయ నేత ఇంట్లో జరిపిన దాడుల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆ ఇంట్లో సోదాలు చేసిన ఐటీ శాఖ అధికారులు.. చెట్టుకు వేలాడ దీసిన కరెన్సీ కట్టను బయటకు తీశారు. మైసూరులోని పుత్తూరు అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్ రాయ్ పోటీ చేస్తున్నారు. అతని సోదరుడు సుబ్రమణ్య రాయ్ ఇంట్లోనే ఐటీ అధికారులు దాడులు చేశారు.
సుబ్రమణ్య రాయ్ ఇంట్లో దాడులకు వెళ్లిన అధికారులకు ఇంట్లో ఉన్న గుబురుగా ఉన్న ఓ చెట్టు పైన ఓ బ్యాగు వేలాడుతుండటాన్ని సోదాల్లో ఐటీ అధికారులు గుర్తించారు. అనుమానం వచ్చి తాడు కిందకు లాగిన ఐటీ అధికారులు.. బ్యాగ్ లోపల కోటిరూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు. ఆ మొత్తాన్ని సీజ్ చేశారు. అంతకుముందే ఐటీ అధికారులు దాడులకు వస్తున్న విషయం తెలుసుకున్న సుబ్రమణ్య రాయ్ ఈ విచిత్ర ప్రయత్నం చేశారు. కాని ఐటీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

