ఎమ్మెల్యే నరేందర్‌ రెడ్డిపై కేసు

క్రైం తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

 ఎమ్మెల్యే నరేందర్‌ రెడ్డిపై కేసు
– బంజారహిల్స్‌ పీఎస్‌లో నమోదు
– ఎమ్మెల్యేతో పాటు మరొకరిపై కూడ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా కోడంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదయ్యింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు రాకేశ్‌ రెడ్డిపై పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. 2018లో ఉప్పరపల్లిలో ఓ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు సామ ఇంద్రపాల్‌ రెడ్డి అనే వ్యక్తి ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌, రాకేశ్‌ రెడ్డిలు మధ్యవర్తులుగా ఉన్నారు. సామ ఇంద్రపాల్ రెడ్డితో తమకు తెలిసిన మరికొందరు భూస్వాములు ఉన్నారని శ్రీరామ్‌ రెడ్డితో కలిసి స్థలం, కమీషన్‌తో కలిపి మొత్తం రూ.3.65 కోట్లకు భూమి విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇందులో వారికి కమీషన్‌ ఇచ్చేందుకు ఇంద్రపాల్‌ కూడా అంగీకరించారు.

ఈ క్రమంలో 2018 మే 24న రూ.90లక్షలు చెల్లించాడు. తర్వాత విడతల వారీగా మొత్తం రూ.3.05 కోట్లు చెల్లించాడు. సెక్యూరిటీ కింద ఎమ్మెల్యే, రాకేశ్‌రెడ్డిలు బాధితుడి వద్ద బ్లాంక్‌ చెక్కులు తీసుకున్నారు. మిగిలిన రూ.60లక్షల కోసం లోన్‌కు అప్లై చేశానని అది రాగానే చెల్లిస్తానని చెప్పాడు. ఈ సొమ్ము చెల్లించడానికి ఆలస్యం అవుతుందని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే తరఫున అనుచరులు ఇంద్రపాల్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈక్రమంలో గతేడాది జూన్‌లో తన ఇంటికి వచ్చి భార్యను బెదిరించారని, తనను గదిలో బంధించి తీవ్రంగా కొట్టారని ఇంద్రపాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి చెర నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు ఫిర్యాదులో ఆరోపించారు. తాను పోలీసులను ఆశ్రయించినప్పటి నుంచి రూ.2.5 కోట్లు ఇస్తేనే గతంలో తాను ఇచ్చిన బ్లాంక్‌ చెక్కులపై ఎలాంటి చర్యలు తీసుకోమని, డిమాండ్ చేసిన డబ్బును చెల్లించకపోతే చెక్‌ బౌన్స్‌ కేసు పెడతామని బెదిరించారని ఇంద్రపాల్‌ ఫిర్యాదులో వెల్లడించారు.

దీంతో హైదరాబాద్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లడం జరిగిందని, అక్కడి నుంచి కేసును పశ్చిమ మండల డీసీపీకి రిఫర్‌ చేశారని బాధితుడు తెలిపారు. కానీ, డీసీపీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించానని చెప్పాడు. కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, రాకేశ్‌ రెడ్డిపై పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఫిల్మ్‌ నగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

chaithany collage