ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ఫైట్..!
– హాట్ టాఫిక్‌గా ఎంపీపీ అవిశ్వాస వ్యవహారం
– వారి వారి వర్గాల కోసం రంగంలోకి దిగిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల వర్గపోరు మరోసారి తెరమీదకు వచ్చింది. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామం ఇందుకు కారణమైంది. వారి వారి వర్గాల కోసం ఇద్దరు నేతలు రంగంలోకి దిగడంతో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరుగుతుందంటే.. బీఆర్ఎస్ పార్టీ నుంచి బషీరాబాద్ మండల ఎంపీపీగా కొనసాగుతున్న కరుణ అజయ్ ప్రసాద్‌పై సొంత పార్టీ ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టాలని తీర్మానించారు. పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ 245 ప్రకారం ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్‌పై అవిశ్వాసం పెట్టేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం మండలంకు చెందిన సొంత పార్టీకి చెందిన 7 మంది ఎంపీటీసీ సభ్యులు సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానాన్ని తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ కు అందజేశారు.
దీంతో వ్యవహారం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిల మద్య ఆదిపత్య పోరుకు దారి తీసింది. దీనిపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి రంగంలోకి దిగారు. మహేందర్ రెడ్డి మార్కు రాజకీయంతో తతంగాన్ని నడిపిస్తున్నారు. ఎంపీపీ కరుణతో పాటు ఆమెకు మద్దుతుగా ఉన్న ఎంపీటీసీలను కాపాడుకునేందుకు రహస్య ప్రాంతానికి తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సైతం ఎంపీపీ కరుణపై అవిశ్వాసంకు సంతకాలను పెట్టిన ఎంపీటీసీలను క్యాంపుకు తరలించే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతలు రంగంలోకి దిగడంతో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మద్య రాజకీయ యుద్ద వాతావరణం ఏర్పడినట్లుగా అందరు చర్చించుకుంటున్నారు.
అవిశ్వాసం తీరు..
అవిశ్వాసంపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గాల నేతలు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 2019 సంవత్సరం జూన్ 7న కరుణ ఎంపికయ్యారని ఈ లెక్కన నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెపై అవిశ్వాసం పెట్టడం జరిగిందని ఎమ్మెల్యే వర్గం ఎంపీటీసీలు పేర్కొంటున్నారు. మరోవైపు జూన్ 7న కరుణ ఎంపీపీగా ఎన్నికైనప్పటికి జులై 4న ఆమె ప్రమాణ స్వీకారం చేశారని, ఈ లెక్కన అవిశ్వాసం పెట్టే వీలు లేదని ఎమ్మెల్సీ వర్గం నేతలు పేర్కొంటున్నారు. ఎంపీపీ కరుణను దించి అన్నపూర్ణను ఎంపీపీగా చేసేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా దామర్ చెడ్ ఎంపీటీసీ రాజుపై ఎన్నిక కమిషన్ వేటు వేసింది. ఎన్నికల సమయంలో ఖర్చు చూపించక పోవడంతో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న 11 ఎంపీటీసీ సభ్యులలో అన్నపూర్ణకు 7 మంది సభ్యులు మద్దతుగా సంతకాలు చేశారు. ఈ అవిశ్వాసం ఎవరికి కలిసోస్తుందనేది ఆసక్తిగా మారింది.
ఇది కూడా చదవండి…


