రూ. 151.46 కోట్ల పంట నష్టపరిహారం
– నేరుగా రైతుల ఖాతాల్లో జమ
– కేసీఆర్ చొరవతో 1.30 లక్షల మందికి లబ్ది
– ఒక్కో ఎకరాకు పరిహారం ఎంత అంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ సర్కారు నష్టపరిహారం ప్రకటించింది. ఈ మేరకు రూ. 151.46 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసేందుకు ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో 26 జిల్లాల్లోని 1.30లక్షల మందికి లబ్ది చేకూరనుంది. ఈయేడాది గత మార్చి 16 నుంచి 21 వరకు తెలంగాణలోని 26 జిల్లాల్లో అకాల వర్షాలు, వడగళ్లతో రైతులు పంటలు నష్టపోయారు. మార్చిలో కురిసిన అకాల వర్షాలతో వరి, జొన్న, మిర్చి, వేరుసెనగ, పత్తి, కూరగాయలు, మామిడితోటలు దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో పంట నష్టాలను స్వయంగా పరిశీలించి ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు వ్యవసాయశాఖ సర్వేలు నిర్వహించి 1,51,645 ఎకరాల నష్టాన్ని నమోదు చేసింది.
దీనికి అనుగుణంగా 1,30,988 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమ చేయాలని ఆదేశించింది. 26 జిల్లాల్లో అకాల వర్షాలు, వడగళ్లతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభత్వం రూ.151.46 కోట్ల పరిహారం విడుదల చేసింది. ఈ నిధులను జిల్లాల వారీగా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులకు పంపించి, నేరుగా రైతుల ఖాతాల్లో వేయాలని ఆదేశించింది. గతంలో అందజేసే పరిహారం చెక్కుల పంపిణీలో జాప్యం జరగడం పట్ల సీఎం కేసీఆర్ నేరుగా నగదు బదిలీకి ఆదేశించారు. ఒక ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం నిధులను మంజూరు చేసింది. మహబూబాబాద్ జిల్లాలో 12,684 మంది రైతుల ఖాతాల్లో మంగళవారం పరిహారం జమ చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ ఒకట్రెండు రోజుల్లో పడనున్నాయి.
ఇది కూడా చదవండి…



