డబుల్‌ దోబూచులాట..!

తాండూరు రాజకీయం వికారాబాద్

డబుల్‌ దోబూచులాట..!
– పంపిణీపై ముందుకు.. వెనక్కి
– ఊసు ఎత్తని ప్రభుత్వ అధికారులు
– అయోమయంలో అర్హులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది ఏండ్లుగా తాండూరు ప్రజలు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లపై ఆశలు పెట్టుకున్నారు. వికారాబాద్‌ జిల్లాలోని తాండూరులో డబుల్ బెడ్‌ రూం ఇండ్ల పంపిణీ దోబూచులాటగా మారింది. జిల్లా కలెక్టర్‌ గా బాధ్యతలు చేపట్టిన నారాయణ రెడ్డి డబుల్‌ బెడ్‌ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. అప్పటి వేగం ఇప్పుడు మాత్రం కనిపించడం లేదు. తాండూరు పట్టణానికి సంబంధించి 580 ఇండ్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. గత మార్చి చివరి వారం నుంచి డబుల్ బెడ్‌ రూం ఇండ్ల పంపిణీ దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 10 రోజుల తరువాత దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. మొత్తం 9436 దరఖాస్తులు అందాయి.

ఆ తరువాత ప్రత్యేక బృందాలతో అర్హులను పేదల వివరాలను ఇంటింటికి వెళ్లి విచారణ జరిపించారు. ఇందులో కొందరు అర్హులు కాకపోయిన దరఖాస్తులు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. విచారణ అనంతరం అర్హులను గుర్తించేందుకు అధికారులు జాబితాను వడపోశారు. అదే సమయంలో జిల్లా కలెక్టర్ సెలవుపై వెళ్లారు. దీంతో అర్హుల ఎంపికలో ఆలస్యం జరిగింది. తిరిగి విధుల్లో చేరిన కలెక్టర్ నారాయణరెడ్డి డబుల్‌ ఇండ్ల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు. కాని ఇప్పటి వరకు ఎలాంటి ఊసు లేకుండా పోయింది. అయితే తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. ముందుగా కేవలం 100 మందికి పంపిణీ చేసి తరువాత అర్హులందరికి పంపిణీ చేయాలని భావించినట్లు తెలిసింది. రోజు రోజుకు డబుల్‌ ఇండ్ల పంపిణీలో ఆలస్యం జరగడంతో అర్హులు అందరు అయోమయ పరిస్థితిలో పడిపోయారు. ఇప్పటికైనా అధికారులు ఆశగా ఎదురు చూస్తున్న అర్హులకు డబుల్ బెడ్‌ రూం ఇండ్లను పంపిణీని త్వరగా చేపట్టాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage