తాండూరులో 12 కొత్త పంచాయతీలు..!
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
– పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాల్లో ఏర్పాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో కొత్త జీపీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 234 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్తగా 12 గ్రామాలను పంచాయతీలుగా చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అందజేసిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. పెద్దేముల్ మండల పరిధిలో ఐదు, యాలాల మండల పరిధిలో నాలుగు, బషీరాబాద్ మండల పరిధిలో మూడు గ్రామాలను పంచాయతీలుగా చేశారు. పెద్దేముల్ మండల పరిధిలోని తింసాస్పల్లి, నర్సాపూర్, పెద్దేముల్ తండా, రచ్చకట్టతండా, దారున్వాగ్ తండాలను కొత్త గ్రామ పంచాయతీలుగా చేశారు. యాలాల మండల పరిధిలోని బాగాయిపల్లి, మల్రెడ్డిపల్లి, పేర్కంపల్లి తండా, దేవులాతండా దుబ్బతండాలను కొత్త గ్రామ పంచాయతీలుగా చేశారు. బషీరాబాద్ మండల పరిధిలోని గంగ్వార్, మల్కాన్ గిరి, పర్ష్యానాయక్ తండాలను కొత్త పంచాయతీలుగా చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి…

