రూ. 5వేలకే స్మార్ట్ ఫోన్..!
– ఆన్‌లైన్‌లో రెండుసార్లు చెల్లింపు
– దారుణంగా మోసపోయిన యువకుడు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఆన్‌లైన్ మోసాలపై ఎంతగా చైతన్య పరిచినా ఎవరో ఒకరు.. ఎక్కడోచోట మోసపోతూనే ఉన్నారు. రూ. 5 వేలకే కొత్త స్మార్ట్ ఫోన్ అందిస్తామని వచ్చిన ఆన్‌లైన్ ప్రకటనను నమ్మి ఓ యువకుడు దారుణంగా మోసపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రావడంతో యువకుడికి జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం సులేపేట్ సమీపంలోని తాడేపల్లికి చెందిన జగదీష్ తాండూరులోని గౌతాపూర్ రోడ్డు మార్గంలో ఉన్న ఓ పాలిషింగ్ యూనిట్లో పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితం ఆన్ లైన్ లో రూ.5వేలకే స్మార్ట్ ఫోన్ అందిస్తున్నట్లు ఓ ప్రకటన చూశాడు.
అందులోని ప్రకటన దారులను సంప్రదించగా.. ముందుగా రూ.3500లు ఫోన్ పే, లేదా స్కాన్ ద్వారా పంపాలని సూచించారు. దీంతో మొదటి సారి జగదీష్ వారికి రూ.3500లు పంపాడు. కాని సమాయానికి ఫోన్ డెలివరి కాలేదు. దీంతో మళ్లీ వారిని సంప్రదించగా మరోసారి రూ.3500లు వేయాలని చెప్పడంతో ఆన్లైన్లో చెల్లించాడు. ఇలా రూ. 5 వేల ఫోన్ కోసం మొత్తం రూ. 11,150లను సమర్పించుకున్నాడు. విసుగు చెంది గట్టిగా నిలదీయడంతో ఇలా ప్రవర్తిస్తే ఫోన్ పంపలేమని ప్రకటన దారులు తేల్చి చెప్పారు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న జగదీష్ కరణ్ కోట్ పోలీసులను ఆశ్రయించేందుకు వచ్చాడు.
అక్కడే కొందరు జగదీష్ ను వివరాలు అడగడంతో మోస పోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఫిర్యాదు చేసేందుకు వచ్చిన జగదీష్ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.
ఇది కూడా చదవండి…

