నాగదేవతల్లారా.. దీవీంచండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నాగదేవతల్లారా.. దీవీంచండి..!
– తాండూరులో వైభవంగా నాగుల పంచమి
– పాలు పోసి మొక్కులు తీర్చుకున్న మహిళలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: నాగదేవతల్లారా.. దీవీంచండి అంటూ భక్తులు నాగదేవతలను వేడుకున్నారు. సోమవారం శ్రావణమాస శుద్ధ పంచమిని (నాగుల పంచమిని) తాండూరు ప్రాంత మహిళలు భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా జరుపుకున్నారు. నాగుల పంచమిని పురస్కరించుకుని పట్టణ ప్రజలు తమ ఇష్టదైవాల దేవాలయాలను సందర్శించి దర్శించుకున్నారు. ఉదయం నుంచే మహిళలు పాముల పుట్టల వద్దకు చేరుకుని చుట్టూ ప్రదక్షణలు చేశారు. నైవేద్యాలు సమర్పించి.. పాలు పోసి సల్లంగా చూడూ.. నాగదేవతా… అంటూ మొక్కులు తీర్చుకున్నారు. పట్టణంలో ఉన్న పాముల పుట్ట ప్రదేశాలు మహిళలతో సందడిగా మారాయి. పట్టణంలోని శాంత మహాల్ థియేటర్ ఆవరణలో ఉన్న పాముల పుట్టల్లో పాలు పోసేందుకు పట్టణ మహిళలు వందలాదిగా తరలిచ్చారు.

కుటుంబ సభ్యులతో పాటు పిల్లాపాపలతో ఒకేసారి తరలిరావడంతో శాంతమహాల్ ప్రాంగణమంతా కిక్కిరిసి పోయింది. దీంతో నాగదేవతను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో బారులుతీరారు. మరోవైపు మున్సిపల్ పరిధి సాయిపూర్లో ఉన్న శ్రీరామలింగేశ్వర దేవాలయంలో కూడా మ వాళలు పెద్ద ఎత్తున తరలివచ్చి నాగదేవతకు పూజలు నిర్వహించి పాలుపోసి నైవేద్యాలు సమర్పించుకున్నారు. అదే విధంగా మల్రెడ్డి పల్లి, గౌతాపూర్ రోడ్డు మార్గంలోని సెంట్ మార్క్స్ హైస్కూల్ ఎదురుగా, నగరేశ్వర దేవాలయంతో పాటు పట్టణంలో పలు ప్రదేశాల్లో ఉన్న పాముల పుట్టల వద్దకు మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో చేరుకుని నాగదేవతకు పాలుపోసి మొక్కులు తీర్చుకున్నారు.

ఇది కూడా చదవండి..

గ్రామీణ రోడ్లకు కొత్త శోభ..!