కమలం దూకుడు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కమలం దూకుడు..!
– తాండూరు అసెంబ్లీపై గురి
– బరిలో నిలిచేందుకు భారీగా దరఖాస్తులు
– టిక్కెట్టు దక్కించుకునే వారేవరో..?
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా తాండూరులో కమలం పార్టీ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికలపై స్పెషల్‌ ఫోకస్‌తో ముందుకు సాగుతోంది. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు తెరపైకి వచ్చారు. పార్టీ ఆదేశాల మేరకు ఈనెల 4 నుంచే బీజేపీ అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరిస్తోంది. దీంతో జిల్లాలోని వివిధ అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసే వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈమేరకు తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి భారీగా దరఖాస్తులను సమర్పించారు. ఇందులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పటేల్ రవిశంకర్, అతని సతీమణి పటేల్ జయశ్రీలు ఇద్దరి తరుపున పార్టీ కమిటి సభ్యులకు దరఖాస్తులను అందజేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ రవిశంకర్ బీజేపీ నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో బీజేపీ పార్టీ నుంచి ఒక ఊపు తీసుకవచ్చారు. యూపీ సీఎం యోగి ఆదిత్య, స్వామీజీలను తాండూరుకు పిలిపించి పార్టీ గెలుపుకోసం తీవ్రంగా శ్రమించారు. అయితే సరిగ్గా ఎన్నికల ముందు ఆయన పార్టీలో చేరడం, పోటీ చేయడంతో అంతగా కలిసిరాలేదు. ఈసారి కూడా వారు పోటీ చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి కూడా తాండూరు అసెంబ్లీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నారు. రైతులనే నమ్ముకుని ఆయన అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికలకు అర్దయేడాదికి ముందే విద్యావేత్తగా ఉన్న యు.రమేష్‌ కుమార్ బీజేపీ ద్వారా క్రీయాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్నికల సమయంలో తనకు కాకుండా పటేల్ రవిశంకర్‌కు టిక్కెట్ కేటాయించడంతో ఆయన పార్టీని బీఆర్‌ఎస్‌లో చేరారు. ఎన్నికల తరువాత పార్టీ విధానాలు నచ్చకపోవడంతో తిరిగి ఆయన బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఈ సారైనా బీజేపీ అభ్యర్థిగా అవకాశం దక్కుతుందనే ధీమాలో ఉన్నారు. ఈ క్రమంలో పార్టీలోకి వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి చందుమహరాజ్ తనయుడు ఎం.నరేష్‌ మహరాజ్‌ వంటి నేతలు పార్టీలోకి రావడంతో ఆశలపై ఆయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సారి ఎలాగైనా పోటీచేయాలనే ఉద్దేశంతో తాండూరు అసెంబ్లీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాండూరు అసెంబ్లీ అభ్యర్థులుగా మురళీకృష్ణ గౌడ్, ఎం. నరేష్‌ మహరాజ్‌లు కూడా టిక్కెట్టు కోసం దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో కమలం పార్టీ కార్యకర్తల్లో ఉత్సహాం పెరిగింది. అయితే చివరి వరకు బరిలో నిలిచేది ఎవరో.. పార్టీ టిక్కెట్టు దక్కించుకునేది ఎవరో అనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి..

పేద విద్యార్థుల సేవలో..!