పాముకాటుతో బీసీ నేత కన్నుమూత
– వైద్యుల నిర్లక్ష్యమంటూ సంఘం నేతల ఆందోళన
– జిల్లా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత, పోలీసులు రంగప్రవేశం
– వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పాముకాటుకు గురై చికిత్స పొందుతూ బీసీ సంఘం నేత కన్నుమూశారు. బాధితుడికి వైద్యం అందించడంలో స్థానిక జిల్లా ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ బీసీ సంఘం నేతలు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వద్ద నినాదాలతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం ఇందిరానగర్ కు చెందిన మతీస్ (55) బీసీ సంక్షేమ సంఘం నాయకులుగా కొనసాగుతున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇంటివద్ద పాముకాటుకు గురయ్యారు. పరిస్థితి ఆందోళన కరంగా మారడంతో కుటుంభీకులు చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వైద్యులు హైదరాబాద్ కు రిఫర్ చేశారు. హైదరాబాద్ తరలిస్తుండగా మతీన్ మృతి చెందినట్లు కుటుంభీకులు తెలిపారు.
అయితే తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చేరిక సమయంలో విధుల్లో ఉన్న వైద్యులు డా. సంతోష్ కుమార్ చికిత్స అందించడంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. దీంతో మంగళవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, సంఘం నేతలు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి ఇంచార్జ్ సూపరిండెంట్ డా. మూర్తి, డ్యూటీ డాక్టర్ సంతోష్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దీంతో, ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఈక్రమంలో ఇంచార్జ్ సూపరిండెంట్ డా. మూర్తి మాట్లాడుతూ ఆసుపత్రిలో పాముకాటుకు సంబంధించి మందులు లేవని ఆరోపించడం సరికాదన్నారు. ఆసుపత్రిలో మందులు ఉన్నాయని, కాని బాధితుడి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో మృతి చెంది ఉండొచ్చని బదులిచ్చారు. ఇందుకు నేతలు అంగీకరించలేదు.
ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణ పోలీస్టేషన్ వద్దకు బయల్దేరారు. ఈ కార్యక్రమంలో బీపీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, నాయకులు జ్యోతి, బోయ రాధాకృష్ణ, నరేందర్, ప్రేమ్ రాజ్, బస్సు తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

