ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
– నామినేషన్ల స్వీకరణకు చర్యలు
– పోలింగ్ పై సిబ్బందికి శిక్షణ
– వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరులో కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ కోటిరెడ్డితో కలిసి పర్యటించారు. అనంతరం తాండూరులోని ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల అధికార యంత్రాల సమన్వయంతో రెండు రాష్ట్రాల మద్య చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా ఇప్పటి వరకు 1కోటి 60 లక్షల నగదును స్వాదీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని, ఫ్లయింగ్ స్క్వాడ్, ఎంసీసీ, వీడియో కవరేజ్, అకౌంటింగ్ బృందాలతో పాటు ఇతర బృందాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయన్నారు. అంతేకాకుండా ఎన్నికల నియమావళిని చేపట్టేందుకు ఎంపికైన అధికారుల బృందానికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. మెటిరీయల్ కూడా 70 శాతం రెడీ చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, అందులో కావాల్సిన సదుపాయాలు, మౌళిక సౌకర్యాల కల్పనకు దృష్టిసారించామన్నారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎం, వీవీ ప్యాడ్ లను సిద్ధం చేసి స్ట్రాంగ్ రూంలో భద్రపరిచామన్నారు. నిర్ణీత గడువులో వాటిని డిస్ట్రీబ్యూట్ చేస్తామన్నారు. మరోవైపు ఇతర ప్రాంతాలకు చెందిన వలస ఓటర్లలో 3 వేల మందిని తొలగించడం జరిగిందన్నారు. కొత్త ఓటర్ల చేర్పుపై కసరత్తు చేస్తున్నామని, ఎన్నికల కమిషన్ అదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు.
3న నోటిఫికేషన్, ఆ రోజు నుంచే నామినేషన్లు
ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు నవంబర్ 3వ తేది రిటర్నింగ్ అధికారులు(ఆర్టీ) నోటిఫికేషన్ జారీ చేస్తారని వెల్లడించారు. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలన్నారు. ఎన్నికల నిబంధనలకు ఎవరైనా విరుద్ధంగా డబ్బులు పంపిణీ చేస్తే సీ విజిల్ యాఫ్ లో ఫోటోలు తీసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. మరోవైపు జిల్లా ఎస్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందన్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి డబ్బు, మద్యం పంపిణీపై దృష్టి పెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్ రావు, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఇది కూడా చదవండి…

