సామ‌ర‌స్యం.. స‌మ‌న్వ‌యం ముఖ్యం

క్రైం తాండూరు రంగారెడ్డి వికారాబాద్

సామ‌ర‌స్యం.. స‌మ‌న్వ‌యం ముఖ్యం
– గ‌ణేష్ ఉత్స‌వాల‌ను శాంతియుతంగా జ‌రుపుకోవాలి
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయ‌ణ
– తాండూరులో శాంతి స‌మావేశం

తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : సామ‌ర‌స్యం.. స‌మ‌న్వ‌యంతో వినాయ‌క చ‌వితి, నిమ‌జ్జ‌న ఉత్స‌వాల‌ను జ‌రుపుకోవాల‌ని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయ‌ణ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం తాండూరు ప‌ట్ట‌ణంలోని ఆర్య‌వైశ్య క‌ళ్యాణ మండపంలో తాండూరు డీఎస్పీ ల‌క్ష్మీనారాయ‌ణ నేతృత్వంలో సీఐలు రాజేంద‌ర్‌రెడ్డి, జ‌లంధ‌ర్‌రెడ్డిల ఆధ్వ‌ర్యంలో శాంతి స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి జిల్లా ఎస్పీ నారాయ‌ణ అడిష‌న‌ల్ ఎస్పీ ర‌సీద్‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎస్పీ నారాయ‌ణ మాట్లాడుతూ పండ‌గ‌ల‌న్ని ప్ర‌జ‌లు సామ‌ర‌స్యంగా జ‌రుపుకోవాల‌న్నిరు. ఏ అవ‌స‌రం.. స‌దుపాయం క‌ల్పించాల్సి వ‌చ్చిన ఇచ్చిపుచ్చుకునే సాంప్ర‌దాయం పాటించాల‌న్నారు. అదేవిధంగా ఈ సారి వినాయ‌క ఉత్స‌వాల‌పై సుప్రీం కోర్టు ఆంక్ష‌ల‌ను విధించింద‌న్నారు. ఈ మేర‌కు మండ‌పాల వ‌ద్ద రాత్రిపూట మైకులు పెట్టరాద‌న్నారు. భ‌జ‌న కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌శాంతంగా జ‌రుపుకోవాలన్నారు. ముఖ్యంగా పండ‌గ వేళ వ‌చ్చే పుకార్ల‌ను న‌మ్మ‌రాద‌ని పేర్కొన్నారు. మండ‌పాల వ‌ద్ద ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా నిర్వ‌హ‌కులు అక్క‌డే ప‌డుకోవాల‌న్నారు. పూజ‌లు, ముస్లిం ప్రార్థ‌న స‌మ‌యాల్లో స‌మ‌న్వ‌యం పాటించాల‌న్నారు. అంతేకాకుండా వినాయ‌కుల‌ను ప్ర‌తిష్టించే నిర్వ‌హ‌కులు విద్యుత్, పోలీసు శాఖ నిబంధ‌న‌లు పాటిస్తూ ఆశాఖ‌ల అనుమ‌తులు త‌ప్ప‌క పొందాల‌న్నారు. ఒక‌ప్పుడు వినాయ‌క ఉత్స‌వాలు నిర్వ‌ణ‌లు తాండూరులో స‌మ‌స్యాత్మ‌కంగా జ‌రిగేవ‌ని, ఈ కార‌ణంగా ఇక్క‌డ భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేసేవార‌ని గుర్తుచేశారు. కాని ఇప్పుడు తాండూరు ప్ర‌జ‌లంతా ఆ మ‌చ్చ‌ను దూరం చేసుకున్నార‌ని, దీంతో ఇక్క‌డి నుంచే వేరే ప్రాంతాల‌కు పోలీసు సిబ్బంది బందోబ‌స్తుకు వెళ్లే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయ‌న్నారు. ఈ ఘ‌న‌త అంతా తాండూరు ప్ర‌జ‌ల‌కే ద‌క్కుతుంద‌న్నారు. గ‌త రెండేళ్ల క్రితం వినాయ‌క చ‌వితి, నిమ‌జ్జ‌న ఉత్స‌వాల‌కు స‌హ‌క‌రించ‌డంప‌ట్ల పాత తాండూరులో అన్ని వ‌ర్గాల వారికి స‌న్మానం ఏర్పాటు చేస్తే అంద‌రు క‌లిసి పోలీసుల‌కే స‌న్మానం చేసిన విష‌యాన్ని గుర్తుచేశారు. తాజాగా రెండేళ్ల త‌రువాత జ‌రుపుకునే వినాయ‌క ఉత్స‌వాలను శాంతియుతంగా జ‌రుపుకునేందుకు బాధ్య‌త తీసుకుంటామ‌ని అన్ని వ‌ర్గాల వారు ముందుకురావ‌డం శుభ‌ప‌రిణామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా హిందూ, ముస్లిం సంఘాల ప్ర‌తినిధుల‌ను అభినందించారు. అడిష‌న‌ల్ ఎస్పీ రషీద్ మాట్లాడుతూ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ప‌ట్ల పోలీసుశాఖ బాధ్య‌త‌గా ప‌నిచేస్తుంద‌న్నారు. ప్ర‌జ‌ల సంక్షేమానికి పొలీసు అధికారులు కృషి చేస్తార‌న్నారు. వినాయ‌క చ‌వితితో పాటు ఇత‌ర పండ‌గ‌లు ప్ర‌శాంతంగా జరుపుకునేందు పోలీసుశాఖ స‌హ‌కారం అందిస్తుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తాండూరు ఆర్డీఓ అశోక్‌కుమార్, మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్‌, వైస్ చైర్ ప‌ర్స‌న్ దీపా న‌ర్సింలు, విద్యుత్ ఏడి ఆదినారాయ‌ణ‌, టీఆర్ఎస్ నాయ‌కులు రాజుగౌడ్, అఫ్పూ(న‌యూం), హిందూ ఉత్స‌వ స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సాయిపూర్ బాల్‌రెడ్డి, మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌జ‌నీకాంత్, ముస్లిం, మైనార్టీ, హిందూ సంఘాల ప్ర‌తినిధులు, యువ‌కులు, నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.