గంజాయిపై అడ్డుకట్ట..!
– రవాణా, వినియోగంపై ఉక్కుపాదం
– అక్రమ ఇసుక, రేషన్ రవాణాకు చెక్
– సాధారణ ప్రక్రియలోనే అధికారుల బదిలీలు
– తాండూరులో ట్రాఫిక్ ఇబ్బందులపై దృష్టి
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లాలో గంజాయి రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలో నిర్వహించిన 35వ జాతీయ రహదారుల భద్రతా ఉత్సవాలలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ కార్యాయలంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ప్రధానంగా డ్రగ్స్, గంజాయిపై దృష్టిసారించడం జరిగిందన్నారు. గత యేడాది గంజాయి రవాణాపై 12 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర ప్రాంతాల నుంచి జిల్లా మీదుగా రవాణా సాగుతున్నట్లు గుర్తించామన్నారు. ఇందుకోసం టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్, రైల్వేపోలీసుల సమన్వయంతో కట్టడి చేస్తున్నామని అన్నారు.
జిల్లాలో పూర్తిగా గంజాయిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా రెవెన్యూ, మైన్స్, పోలీసు శాఖలతో కలిసి అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. అక్రమ ఇసుక రవాణా దారులపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. దీంతోపాటు రేషన్ బియ్యం దందాపై ముమ్మర తనిఖీలు చేపట్టి అక్రమాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా తాండూరు పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ద్వారా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నామన్నారు. పట్టణంలోని అలంకార ప్రాయంగా మారిన ట్రాఫిక్ సిగ్నళ్లను మున్సిపల్ అధికారులతో చర్చించి పునురుద్దరించేలా కృషి చేస్తామన్నారు.
మరోవైపు జిల్లాలో పోలీసు అధికారుల బదిలీలు సాధారణ ప్రక్రియలోనే జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, సీఐ సంతోష్ కుమార్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

