గులాబీ జెండా చోరీ..!

క్రైం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

మాయ‌మైన గులాబీ జెండా..!
– డాగ్ స్వ్కాడ్‌ను దించి వెతుకులాట‌
– విస్మ‌యం వ్య‌క్తం చేసిన ప్ర‌జ‌లు
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: అది వికారాబాద్ జిల్లా ప‌రిగి మున్సిప‌ల్‌లోని ఓ గ‌ల్లి. స‌రిగ్గా బుధ‌వారం ఉద‌యం పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగారు. గ‌ల్లీ మొత్తం చెక్క‌ర్లు కొడుతూ డాగ్ స్క్వాడ్ వెంట ప‌రుగులు పెట్టారు. ఏదో దారుణ హ‌త్య చేసిన నిందితుడి కోస‌మో.. భారీ చోరీలు చేసిన దొంగ‌ల కోస‌మో అనుకుంటే పొర‌బ‌డిన‌ట్లే. గంట‌ల పాటు జ‌రిగిన ఈ తంతంగ‌మంతా అధికార పార్టీ జెండా చోరి అయినందుకే అని తేల‌డంతో అంద‌రు ముక్కున వేలేసుకున్నంత ప‌నైంది.
అస‌లు విష‌యానికి వ‌స్తే ప‌రిగి మున్సిప‌ల్ ప‌రిధిలోని మ‌ల్లెమోనిగూడ‌లో ఇటీవ‌ల ఓ రాత్రి అధికార టీఆర్ఎస్ పార్టీ జెండా చోరీకి గురైంది. దీంతో ఆ పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ జెండా చోరి అయిన‌ట్లు ఉన్న‌తాధికారుల‌కు తెలిస్తే చివాట్లు తప్ప‌వ‌నుకున్నారేమో అధికారులు వెంట‌నే డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. మ‌ల్లెమోనిగూడ‌లో గ‌ల్లిగ‌ల్లి తిరుగుతూ పెద్ద హాడావుడి చేశారు.
గ‌ల్లిగ‌ల్లిలో పోలీసు సిబ్బంది పరుగులు చూసిన ప్ర‌జ‌లు అయోమ‌యానికి గుర‌య్యారు. హ‌త్య జ‌రిగిందేమా..ఇండ్లు గుల‌య్యాయామో అంటూ ఆందోళ‌న చెందారు. తీరా అస‌లు విష‌యం తెలిసి పెద్ద పెద్ద చోరీలు గాని, హ‌త్య‌లు జ‌రిగితే గాని స్పందించే పోలీసులు ఓ టీఆర్ఎస్ జెండా కోసం పరుగులు పెట్ట‌డంతో పెద‌వి విరుపు గుస‌గుస‌లు చేసుకున్నారు. చివరకు జెండాను చోరీ చేసిన నిందితుడిని పట్టుకోవడంలో విఫలం కావడం గమనార్హం.