బీఆర్ఎస్, బీజేపీలను నమ్మితే దగా..!
– పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గెలుపే లక్ష్యం
– కాంగ్రెస్ను గెలిపించి సీఎంకు కానుకిద్దాం
– వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి
– తాండూరులో కార్యకర్తల సమావేశం సక్సస్
– హాజరైన జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలను నమ్మితో మరోసారి దగా పడడం ఖాయమని, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం జీపీఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధ్యక్షతన తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాఘువీర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగితే అప్పటి ఎమ్మెల్యేలు నోరు మెదుపలేదని అన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో పాలమూరు ఎత్తిపోతలకు రూ.23 వేల కోట్ల నిధులు ఖర్చుబెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. ప్రస్తుతం జిల్లాలో సీఎంగా రేవంత్ రెడ్డి, స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ లు కొనసాగుతున్నారని, దీంతో జిల్లా అభివృద్ధిలో దూసుకపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాలో రూ. 107 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా తాండూరు మీదుగా రెండు జాతీయ రహదారులు వస్తున్నాయన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని, వారికి ఓటేస్తే మురిగిపోతాయని అన్నారు. వాళ్లకు ఓటేస్తే ఒక్క సంక్షేమ పథకాలు రావని చెప్పారు. చేవెళ్ల మీటింగ్ లో సునితమ్మను భారీ మెజారిటీతో గెలుపించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. చేవెళ్ల పార్లమెంట్, మహబూబ్ నగర్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్చార్జిగా ఉన్నారని, ఎంపీని గెలిపించి సీఎంకు కానుకగా ఇద్దామని అన్నారు. బాగా పనిచేసే నాయకులకు పదవులు వస్తాయని చెప్పారు.
సమన్వయంతో గెలుపుకు కృషి
అనంతరం వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డి మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనపై కొట్లాడి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చారని కొనియాడారు. డైనమిక్ లీడర్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీలలో 5 అమలు అవుతున్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రజాలకోసమే పుట్టడాని అనిపిస్తుందన్నారు. బీఆర్ఎస్ వల్ల తమ కుటుంబం ఎన్నో అవమానాలకు గురయ్యిందన్నారు. స్వేచ్చా, సమానత్వం ప్రజాస్వామ్యం ఫరిడవిల్లే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు.
పార్టీలో నిబద్ధతగల కరడు గట్టిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారని గుర్తుచేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎక్కువ నిధులు తాండూరుకు కేటాయించడం జరిగిందన్నారు. 2006లో గ్రామాల్లో మౌళిక సదుపాయాలు లేకుండే. ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, అంగన్ వాడి, డ్వాక్రా భవనాలు కట్టించాము. రైతులకు పానాది రోడ్లు వేశామని అన్నారు. పట్నం కుటుంభం తాండూరుకు ఎం చేసింది అనే వారికి మేము చేసిన పనులే సమాధానం ఇస్తామని చెప్పారు. నాకు ఏ పదవి వచ్చిన నేను నాలాగే ఉంటానని, ప్రతి కార్యకర్తను, నాయకులను సమానదృష్టితో చూస్తానని వివరించారు. మొదటినుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు నా మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
పార్టీకోసం పనిచేసే ప్రతిఒక్కరికి నేను గుర్తుపెట్టుకుంటానని అన్నారు. ఎంపీగా అవకాశం వచ్చి.. తనను భారీ మెజార్టీ తో గెలిపిస్తే సీఎం కు బలం పెరుగుతుందని అన్నారు. పాతకొత్త వారు సమన్వయంతో పనిచేయాలని కోరారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.
భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యం
మరోవైపు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మేజార్టీతో విజయం సాధించడమే లక్ష్యమని.. అసెంబ్లీ ఎన్నికల తరహాలో పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని అన్నారు.
తాండూరు నియోజకవర్గం నుంచి 50 వేల మెజార్టీ అందించేలా అందరు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గపోరుకు లేదని, అందుకు తావే లేదన్నారు. ఎంపీ నిధులతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు పూర్తి చేసి చూపిస్తానని అన్నారు. రాబోయే రోజుల్లో ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి ధారాసింగ్, వికారాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభారాణి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్, బషీరాబాద్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ రవిగౌడ్, సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, బియ్యని శ్రీనివాస్ రెడ్డి, పీలారం మహిపాల్ రెడ్డి, ఎం. రాకేష్, అబ్దుల్ రావుఫ్, సురేందర్ రెడ్డి, అజయప్రసాద్, ఉత్తoచంద్, జనార్దన్ రెడ్డి, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, పీ.బస్వరాజ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, బోయరవి, మసూద్, మాజీ కౌన్సిలర్ పరిమళ, బంటు మల్లప్ప, మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు అబీబ్ లాల, నర్సిరెడ్డి, నాగప్ప, నర్సిములు, గోపాల్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

