అయ్యో.. ఎంత ఘోరం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

అయ్యో.. ఎంత ఘోరం..!
– బిల్డింగ్ స్లాబ్ మీద పడి కార్మికుడి దుర్మరణం
– తాండూరు మున్సిపల్ పరిధిలో ఘటన
– దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ స్లాబ్‌ మీద పడి ఓ కార్మికుడు దుర్మరణం చెందాడు. బుధవారం జరిగిన సంఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని లారీ పార్కింగ్ సమీపంలో హసన్‌ నగర్‌ ప్రాంతంలో ఓ వ్యాపారికి చెందిన భవన నిర్మాణం జరుగుతోంది. దాదాపు 4 అంతస్తులో బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నారు.

ఈ బిల్డింగ్‌లో పనులు చేసేందుకు బొంరాంస్‌పేట్ మండలం జానకంపల్లికి చెందిన మోతుకూర్ వెంకటయ్య(42) సత్యమ్మ అనే మహిళతో కలిసి వచ్చారు. భవనం కింద వెంకటయ్య ఉన్న సమయంలో 4వ అంతస్తులో నాణ్యత లేకుండా ఏర్పాటు చేసిన స్లాబ్‌ ఒక్కసారిగా కుప్ప కూలీ పడిపోయింది. పక్కనే ఉన్న జీపుతో పాటు సరిగ్గా వెంకటయ్య మీద స్లాబ్ పడిపోవడంతో శిథిలాల కింద తీవ్ర గాయాలై ఇరుక్కుపోయాడు.

తీవ్ర గాయాలతో వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ సంతోష్‌ కుమార్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ యంత్రంతో స్లాబ్ శిథిలాల కింద ఉన్న వెంకటయ్య మృతదేహాన్ని పక్కకు తీశారు.

వెంకటయ్య మృతితో కుటుంభీకులు బోరున విలపించారు. ఎంత ఘోరం జరిగిందయ్యా అంటూ విలపించిన తీరు కుటుంబంలో కలిచివేసింది. వెంకటయ్య మృతితో కుటుంభంలో విషాదం నెలకొంది. మరోవైపు జరిగిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవన్నట్లుగా తెలిసింది.

ఇదికూడా చదవండి…

యాలకుల్లో ఔషధాలు..!