సం’పన్ను’లకే బీజేపీ కొమ్ము..!

జాతీయం తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

సం’పన్ను’లకే బీజేపీ కొమ్ము..!
– సామాన్యుల నడ్డి విరుస్తోన్న మోడీ సర్కార్
– ధర్మంపేరుతో విభేదాలు సృష్టించే తంత్రాలు
– సొంత రాజ్యాంగం కోసమే బీజేపీ ప్రత్యేక దృష్టి
– ఓట్ల అడిగేందుకు వస్తే ప్రశ్నించండి, నిలదీయండి
– కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 30లక్షల ఉద్యోగాలు
– గ్రామాలతోపాటు పట్టణ వాసులకు ఉపాధి పనులు
– ప్రతి మహిళ ఖాతాలో రూ. 1లక్ష నగదు
– ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : సామాన్యులపై పన్నుల భారం పెంచి సంపన్నులకు బీజేపీ కొమ్ము కాస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. నోట్ల రద్దు, జీఎస్టీలతో పేదల నడ్డి విరించిందని మండిపడ్డారు. శనివారం వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన జన జాతర సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆమె ప్రసంగిస్తూ బీజేపీ పదేళ్ల పాలనలో పేదలపై వేసే పన్నులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని, పేద రైతులు రూ.50 వేలు, రూ.లక్ష రుణాలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అలాంటి వారికి రుణమాఫీ చేసేందుకు అంగీకరించని బీజేపీ ప్రభుత్వం దేశంలోని బడా వ్యాపారులకు మాత్రం రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిందన్నారు. అంతేకాకుండా కీలకమైన సంస్థలను తమ చెప్పుచేతల్లో పెట్టుకొని ఆడిస్తోందని అన్నారు.

ప్రధాని మోడి ఎప్పుడూ కూడా ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలుసుకునే ప్రయత్నాన్ని చేయరని. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం వచ్చి ధర్మం అనే నినాదం ఎత్తుకుంటారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బీజేపీ హయాంలో ఆగిపోయింది… దేశంలో 70 కోట్ల మంది నిరుద్యోగులున్నారు.. 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.. సామాన్య ఆదాయ పన్ను పెరుగుతోంది… దేశంలో విమానాశ్రయాలు, బొగ్గు గనులు, విద్యుత్, నౌకాశ్రయాలు పెద్ద పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్తున్నాయన్నారు.

అదానీ, అంబానీ పన్నులను ప్రజలు చెల్లిస్తున్నారని, దేశం లోని సంపదను ఇద్దరు, ముగ్గురు ధనవంతులకు వెళ్తోందన్నారు. రూ. 16 లక్షల కోట్లను మోదీ తన మిత్రులకు రుణమాఫీ చేశారు కానీ పేద రైతులకు మాత్రం రుణమాఫీ చేయ లేదన్నారు. మీడియా సంస్థలు ఇద్దరి ముగ్గురి చేతుల్లోకి వెళ్లడంతో వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లడం లేదన్నారు. మోదీ, ఆయన మంత్రులు ఓటు అడగడానికి వచ్చినప్పుడు ప్రశ్నించాలని, నిలదీయన్నారు. ఈ చైతన్యం తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలవ్వాలని కోరారు. మహాత్మ గాంధీ స్పూర్తితో ఈ దేశం అహింస, సత్యంపై అధారపడి ఉండగా బీజేపీ మాత్రం ధర్మం పేరుతో అన్నదమ్ముల్లాంటి ప్రజల మద్య విభేధాలు సృష్టించి చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు.

రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి మోదీ దానిని రాయలేదని, మన పూర్వీకులు ఎంతో కృషి చేసి భావితరాల కోసం రూపొందించారు. రాజ్యాంగమే మనకు ఎన్నో అవకాశాలు కల్పించింది. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది రాజ్యాంగం మాత్రమే అన్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత సొంత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు బీజేపీ దృష్టి పెట్టిందన్నారు. భాజపా అబద్ధాలు నమ్మి.. మోసపోయేది లేదని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.

మరోవైపు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి కూలీ రూ.400కు పెంచుతామన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ వాసులకు ఉపాధి పనులు అమలు చేస్తామన్నారు. దీంతో పాటు చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అంతేకాకుండా ప్రతి మహిళా అకౌంట్లో రూ. లక్ష వేస్తామని హామీ ఇచ్చారు. దేశ ప్రజలు చెప్పే సమస్యలు వినడానికి కాంగ్రెస్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, స్పీకర్ ప్రసాద్ కుమార్, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, నాయకులు కరణం పురుషోత్తంరావు, డాక్టర్ సంపత్ కుమార్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, లైబ్రరీ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రుణమాఫీ నాదే బాధ్యత..!