రుణమాఫీ నాదే బాధ్యత..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

రుణమాఫీ నాదే బాధ్యత..!
– రూ. 2లక్షలు అమలు చేసి రుణం తీర్చుకుంటా
– కేసీఆర్ సవాల్‌ స్వీకరించి ముక్కు నేలకు రాయాలి
– బీజేపీ, బీఆర్ఎస్‌ వల్లే వికారాబాద్‌ జిల్లాకు అన్యాయం
– కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జిల్లాకు ప్రాధాన్యం దక్కింది
– జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ అమలు చేసే బాధ్యత తనపైనే ఉందని, రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ అమలు చేసి వారి రుణం తీర్చుకుంటానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్‌ జిల్లాలోని తాండూరులో నిర్వహించిన జనజాతర సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుందని, దీంతో వికారాబాద్ జిల్లా కు ముఖ్యమంత్రి పదవి, స్పీకర్ పదవి దక్కిందన్నారు గుర్తుచేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ వికారాబాద్ ప్రాంతానికి రావాల్సిన గోదావరి జలాలు రద్దు చేశారని అన్నారు. ఆయన స్వార్థం వల్ల జిల్లాను ఎడారిగా మార్చారని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రాకుండా చేసిందన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం కూడా పాలమూరు – రంగారెడ్డికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో పాటు జాతీయ హోదా ఇవ్వలేదని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వల్ల జిల్లాలో కందులతో పాటు ఇతర పంటలకు మద్దతు ధర దక్కలేదన్నారు.

వికారాబాద్ శాటీ లైైట్ సిటీ ఆగిపోయిందని, ఎంఎంటీఎస్ రైలు రాలేదన్నారు. మరోవైపు రైతు బంధు నిధులు ఇస్తే కేసీఆర్ అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాలని సవాల్ చేశానని గుర్తుచేశారు. 7వ తేదీన రైతు బంధు నిధులు వేయడం జరిగిందని, సవాల్ స్వీకరించి కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయడం తన బాధ్యత అని ఉద్ఘాటించారు. అనంతగిరి పద్మనాభుని సాక్షిగా ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానని అన్నారు. అలా చేయకపోతే ఈ ముఖ్యమంత్రి పదవి నిష్ప్రయోజనమన్నారు. తెలంగాణకు ప్రధాని మోడి, అమిత్‌షాలు సంక్రాంతి పండుగ గంగిరెద్దులా వచ్చిపోతున్నారని విమర్శించారు. బయ్యారం ఉక్కు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ కారిడార్, మెట్రో రైలు, ఐటీ కంపెనీలను రాష్ట్ర విభజన సమయంలో సోనియమ్మ రాష్ట్రానికి ఇచ్చింది కాని బీజేపీ తెలంగాణ కు గాడిద గుడ్డు ఇచ్చిందని విమర్శించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. భక్తి గుండెల్లో ..వారే అసలైన హిందువులు.. దేవుడి పేరు మీద ఓట్లు భిక్షమెత్తుకునే వారు హిందూ ద్రోహులు బీజేపీ వాళ్లని అన్నారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, ఎల్లమ్మ,పోచమ్మ పండుగ లు మనం చేయలేదా.. దేవుడి పేరు మీద విభజించాలని బీజేపీ చూస్తోంది అంటూనే ప్రజలు ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డికి పక్కా లక్ష ఓట్ల మెజారిటీ ఇవ్వాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, స్పీకర్ ప్రసాద్ కుమార్, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, నాయకులు కరణం పురుషోత్తంరావు, డాక్టర్ సంపత్ కుమార్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, లైబ్రరీ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రూ. 20కే సంపూర్ణ భోజనం..!