పార్లమెంట్ పరిపూర్ణం..!
– తాండూరులో ముగిసిన పోలింగ్
– నియోజకవర్గంలో 67 శాతం నమోదు
– ప్రకటించిన సహాయ ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా..పరిపూర్ణంగా ముగిశాయి. నియోజకవర్గ వ్యాప్తంగా సాయంత్రం సమయం ముగిసేవరకు 67 శాతం నమోదైనట్లు తాండూరు సహాయ ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్ రావు ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని 277కేంద్రాలలో పోలింగ్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గం మొత్తం 2 లక్షల 43 వేల 192 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళ ఓటర్లు 1 లక్ష 25వేల 364, పురుషులు 1లక్ష 17వేల 821 మంది, 7మంది ట్రాన్స్ జెండర్లు ఓటర్లు ఉన్నారు.
సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 6గంటల వరకు తాండూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్, తాండూరు పట్టణంలో పోలింగ్ కొనసాగింది. 26 సెక్టార్లలో పోలింగ్ సవ్యంగా జరిగింది. ఉదయం మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నానికి పుంజుకుని, సాయంత్రం సమయానికి మళ్లీ మందకోడిగా కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ పోలింగ్ కొనసాగగా 67 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించారు.
ఇందులో పురుషులు 81248 మంది, మహిళలు 82518 మంది, 3 మంది ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు వెల్లడించారు. ఈ సారి ఓటర్లను ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించడంతో గత పార్లమెంట్ ఎన్నికల కన్నా ఈసారి ఓటింగ్ శాతం మెరుగు పడినట్లు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగిసేలా సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదికూడా చదవండి…

