
ఆ పదవులపై ఆశలేదు..!
– రేసులో అంతకన్నా లేను
– ఐదేళ్లలో అదే నా టార్గెట్
– చేవేళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర మంత్రి హోదాతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవులపై తనకు ఆశ లేదని, రేసులో కూడా లేనని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఎంపీగా గెలిచిన తరువాత శనివారం తాండూరు పట్టణంలో జరిగిన కార్యక్రమానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తొలిసారిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నుంచి ఎంపీగా గెలిచినా చేవేళ్ల పార్లమెంట్ అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవిపై తనకు ఆశ లేదన్నారు.

కేంద్ర మంత్రి పదవి పొందితే తాండూరు ప్రాంతానికి వచ్చే పరిస్థితి ఉండేది కాదని, పదవి లేకుంటే ప్రజలకు, అభివృద్ధికి దగ్గరగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో కూడా తాను లేనని స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి పొందాలంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వ్యవహారాలగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇంకా తనకు అంతటి సమర్థత రాలేదని. రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లే అయిందని చెప్పుకొచ్చారు. కావున కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర అధ్యక్ష పదవులపై తనకు ఆశలు లేవన్నారు. అదేవిధంగా 2014లో ప్రధాని నరేంద్ర మోడి ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం తనను ఆకర్షించిందన్నారు. బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పుడే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గుర్తుచేశారు.
అప్పట్లో ఒక ట్రక్కు నుంచి 30 గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగుదొడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. గతంలో పాఠశాలల్లో మరుగుదొడ్లను శుభ్రం చేసే వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పనిచేసే వాళ్లను తొలగించిందని విమర్శించారు. ప్రస్తుతం 7 ట్రక్కులతో 110 గ్రామాల్లోని స్కూల్లలో స్వచ్ఛత కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తాజాగా శనివారం తాండూరు పట్టణంలో 8వ ట్రక్కును ప్రారంభించడం జరిగిందన్నారు. వచ్చే ఐదేళ్లలో చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాలకు ట్రక్కు సేవలను విస్తరించి.. పాఠశాలలను స్వచ్ఛ విద్యాలయాలుగా మార్చడమే లక్ష్యమని అన్నారు. ఇందుకు సీఎస్ఆర్ అనే సంస్థను భాగస్వామ్యం చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు.
రెండు వారాల్లో జుంటుపల్లికి మరమ్మత్తులు
అంతకుముందే ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి యాలాల మండలం జుంటుపల్లి సాగునీటి ప్రాజెక్టును సందర్శించినట్లు తెలిపారు. తూముకు మరమ్మత్తులు చేయడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని అన్నారు. కేవలం రూ. 6లక్షలతో మరమ్మత్తులు పూర్తి చేసే అవకాశం ఉండి కూడా చేపట్టలేదన్నారు. దీంతో సుమారు 2089 ఎకరాలకు సాగునీరు అందడం లేదన్నారు.

ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఇందుకు ఎమ్మెల్యే కూడా స్పందించారని, ఇరిగేషన్ శాఖ ద్వారా మరమ్మత్తులు చేయిస్తామని చెప్పినట్లు ఎంపీ కొండా వెల్లడించారు. రెండు వారాల్లో జుంటుపల్లి ప్రాజెక్టుకు మరమ్మత్తులు జరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా శివసాగర్ ప్రాజెక్టుపై కూడా దశలవారిగా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎంపీ వెంట యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుఉల యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్. బీజేపీ మహిళ మోర్చ నాయకులు అంతారం లలిత, సాహు శ్రీలత, బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం. జిల్లా కార్యద్శి బంటారం. భద్రేశ్వర్, నాయకులు గాజుల శాంతుకుమార్, శేఖాపురం ఆంజనేయులు, దోమ కృష్ణ, బీసీ సెల్ జిల్లా నాయకులు బొప్పి శ్రీహరి. అంతారం కిరణ్, నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

