
భూమి స్వాదీనంపై బ్రేకులు..!
– ప్రైవేటు లాండ్పై హైకోర్టు ఉత్తర్వులు
– మళ్లీ చర్చనీయాంశమైన వీవీహెచ్ఎస్ క్రీడా భూమి వివాదం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం విజయ విద్యాలయ క్రీడా స్థలంను ప్రభుత్వం స్వాదీనం చేసుకున్న నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసినట్లు తెలిసింది. భూమి స్వాదీనం ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని పసారం కుటుంభీకులు తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం విజయ విద్యాలయ పాఠశాల సమీపంలోని ఖాళీ స్థలం విషయంలో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

పట్టణానికి చెందిన పసారం కుటుంభీకులు బస్వరాజ్, నిషాంక్ లు తమ పూర్వీకుల స్థలం అంటూ భూమిని స్వాదీనం చేసుకుని చదును చేసుకున్నారు. అయితే ఈ స్థలం ప్రభుత్వం చెందిందని పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. అయితే పసారం కుటుంభీకుల వద్ద ఉన్న పత్రాల్లో స్థలానికి సంబంధించిన సర్వే నెంబర్ 111 లేకపోవడంతో అట్టి స్థలం ప్రభుత్వానికి చెందిందని నిర్దారించారు. ప్రభుత్వ భూమిగా స్వాదీనం చేసుకుని బోర్డు ఏర్పాటు చేశారు.
దీనిపై పసారం కుటుంభీకులు తమ ప్రైవేటు భూమిలో అధికారం జోక్యం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఫిటీషనర్ తరుపు న్యాయవాది చేసిన వాదనల మేరకు న్యాయమూర్తి తాండూరు ఎమ్మార్వో అమలు చేస్తున్న ఉత్తర్వులను నిలిపివేయాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రైవేటు భూమిలో జోక్యం చేసుకోవద్దని మద్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. దీంతో తాండూరు పట్టణంలో విజయ విద్యాలయ సమీపంలోని వివాదాస్పద స్థలం మళ్లీ చర్చనీయాంశమైంది.

ఇదికూడా చదవండి…

