ప్రజా సేవే ధ్యేయం..!
– బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ దీపా నర్సింలు
– పార్టీ కౌన్సిలర్లకు ఘన సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా సేవే ధ్యేయంగా పనిచేయాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. శనివారం ఆమె ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లకు సన్మానం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిందని అన్నారు. పార్టీపై ఉన్న నమ్మకం, అభిమానంతో ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలిపించారని అన్నారు. కావున పార్టీ కౌన్సిలర్లు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సేవే ధ్యేయంగా పనిచేయాలని అన్నారు. వార్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.

అధికార పార్టీ నేతలు, కౌన్సిలర్లు అక్రమాలు, అవినీతికి పాల్పడితే పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను సన్మానించడం పట్ల 7వ వార్డు కౌన్సిలర్ ఈర్షాద్ హర్షం వ్యక్తం చేస్తూ.. దీపా నర్సింలు, నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, నరేందర్ గౌడ్, అబ్దుల్ సలీం, నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


