మున్సిపల్ ఆస్తుల పరిరక్షణ అత్యవసరం
– సమావేశం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోండి
– తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్‌కు కౌన్సిలర్ల వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో మున్సిపల్ ఆస్తులను కాపాడేందుకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్‌ను స్థానిక ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, వరాల శ్రీనివాస్ రెడ్డి, సోమశేఖర్‌లు కోరారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్‌ను కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. పట్టణంలోని మున్సిపల్ స్థలాలు, పార్కులు అన్యాక్రాంతమవుతున్నాయని ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ దృష్టికి తీసుకవచ్చారు. 13వ వార్డు గ్రీన్ సిటీ సర్వేనెంబర్ 208లో 5166 చదరపు గజాల స్థలాన్ని గుర్తించి కంచె ఏర్పాటు చేయాలన్నారు. అదే సర్వేనెంబర్‌లో 13,14 గుంటల భూమిపై కొందరు దొంగ
పత్రాలు, లేఅవుట్‌లు సృష్టించి స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తూ వారి ఇండ్ల స్థలాను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా పట్టణంలోని రాచన్న దేవాయలం పక్కన, బంటారం ప్రభులింగం ఇంటి వెనుకాల ఉన్న స్థలంతో పాటు మసీదు వెనుకాల ఉన్న మున్సిపల్ స్థలాన్ని, ఖానావళీ చంద్రప్ప ఇంటి సమీపంలో ఉన్న స్థలాలను గుర్తించి కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞాపనపత్రంలో పేర్కొన్నారు. కావున అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మున్సిపల్ ఆస్తులను పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ సానుకూలంగా స్పందించినట్లు కౌన్సిలర్లు తెలిపారు.

