జిల్లాలో 192 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
– వచ్చే నెల నుంచి ప్రారంభానికి చర్యలు
– పకడ్బందీ ఏర్పాట్లను చేస్తున్న యంత్రాంగం
– 24 గంటల్లోనే రైతుల ఖాతాలో చెల్లింపులు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: ధాన్యం రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో వికారాబాద్ జిల్లా యంత్రాగం దృష్టిసారిచారు. డీసీఎంఎస్, సహాకార సంఘాలు, ఐకేపీ ద్వారా జిల్లాలో 192 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చే నెల నవంబర్ 15 నుంచి వీటిని ప్రారంభించే అవకాశం ఉంది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులు పకడ్బందీ ఏర్పాట్లను చేస్తున్నారు. కేంద్రాలలో తూకం యంత్రాలు, గన్నీ బ్యాగులు, టార్పలిన్లు, తేమను కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచబోతున్నారు. దీంతో పాటు రవాణా సదుపాయాలపై కూడ దృష్టిసారించారు. అదేవిధంగా ఈ యేడాది మేలు రకం ధాన్యానికి రూ. 1960, సాధారణ రకం ధాన్యానికి 1940లు మద్దతు ధర చెల్లించేందుకు నిర్ణయించారు. ధాన్యం విక్రయించిన రైతులకు 24 గంటల్లో వారి ఖాతాలో డబ్బుల చెల్లింపులు జరిగే చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం అధికారులు రైతుల ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
కేంద్రాలపై ప్రత్యేక నిఘా
మరోవైపు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేయబోతున్నారు. వీలైతే సీసీ కెమెరాలు కూడ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

