తాండూరు పురోగతికి స్కెచ్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు పురోగతికి స్కెచ్..!
– అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళికలు
– ఎన్‌హెచ్‌ 167 పూర్తికి ప్రత్యేక దృష్టి
– చిలుక వాగు ప్రక్షాళలనకు కసరత్తు
– అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ పురోగతికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. పకడ్బందీ ప్రణాళికలతో అభివృద్ధి పనుల్లో వేగం పెంచేలా దృష్టిసారిస్తున్నారు. బుధవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నేషనల్ హైవే డీఈ నరేందర్, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ ప్రభాకర్ లతో సమావేశం అయ్యారు. తాండూరు నియోజకవర్గంలో జరిగే నేషనల్ హైవే రోడ్డు పనులపై చర్చించారు.

అదేవిధంగా తాండూరులోని ప్రధాన సమస్య అయిన చిలుకవాగు ప్రక్షాళన, కాగ్నా నది నుంచి మున్సిపల్ వార్డులకు తాగునీరు అందించే కొత్త పైపులైన్ పనులు, చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఈ పనులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రణాళికలు రూపొందించి పనులను వేగవంతం చేయాలన్నారు.

దీంతో పాటు తాండూరులోని నర్సింగ్ కాలేజీ పనుల గురించి ఆరా తీసి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. నర్సింగ్ కాలేజీని విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకరావాలన్నారు. అంతేకాకుండా ఇతర పనులను కూడా పూర్తి చేసేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే ఏఈ, పబ్లిక్ హెల్త్ డీపీ సాజిద్, ఖాజతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

భక్తి మార్గం.. సేవా భావం..!