అక్రమంగా ఆక్రమణ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అక్రమంగా ఆక్రమణ..!
– వివాదాస్పద భూమిపై గగ్గోలు
– తప్పుడు సర్వేభూమిలో దౌర్జన్యం
– న్యాయపరంగా తేల్చుకుంటాం
– అబ్దుల్ రజాక్ తరుపు న్యాయవాది వెల్లడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వివాదాస్పద భూమిలో అక్రమంగా ఆక్రమణ చేసుకున్నారని తాండూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది కె.గోపాల్ విమర్శించారు. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని సర్వేనెంబర్ 51, 5ల మద్య ఉన్న భూమిపై అబ్దుల్ రజాక్, కట్కం వీరేందర్‌ల మద్య వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. గురువారం అబ్దుల్ రజాక్ తరుపున న్యాయవాది గోపాల్ మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. అబ్దుల్ రహమాన్‌ అనే వ్యక్తి నుంచి అబ్దుల్ రజాక్ సర్వేనెంబర్ 51లోని సుమారు 11 ఎకరాల భూమికి చట్ట ప్రకారం జీపీఏ పొందారని తెలిపారు. ఇదే సర్వేనెంబర్‌కు పక్కన ఉన్న సర్వేనెంబర్ 5 పట్టణంలోని మల్ రెడ్డిపల్లి పరిధిలోకి వస్తుందని తెలిపారు.

సర్వేనెంబర్ 51లో కొంత స్థలం మిగిలిపోవడంతో ప్రస్తుతం అదే స్థలంపై వివాదం ఏర్పడిందన్నారు. 2015లో సర్వేనెంబర్ 5లో దాదాపు 760 గజాల భూమిని కొనుగోలు చేసిన కట్కం వీరేందర్ 2017లో తమ స్థలం అంటూ ఫెన్షింగ్ నిర్మాణం చేసుకున్నారని తెలిపారు. అయితే జీపీఏ హోల్డర్ అయిన రజాక్ తమకు సంబంధించిన సర్వేనెంబర్ 51లో కట్కం వీరేందర్ ఆక్రమణకు వచ్చారని ఆరోపించారు. సర్వేనెంబర్ 5లో కాకుండా 51లోకి వచ్చి భూమిని అక్రమంగా ఆక్రమణలోకి తీసుకున్నారని వివరించారు. నిజానికి కట్కం వీరేందర్ స్వాదీనం చేసుకున్న భూమి సర్వేనెంబర్ 51లోకి వస్తుందని అన్నారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు చేసిన సర్వేలలో కట్కం వీరేందర్ ప్రస్తుతం ఆక్రమణలో ఉన్న భూమి సర్వేనెంబర్ 51లోకి వచ్చినట్లు తేలిందన్నారు. ఈ కారణంగానే అట్టి స్థలంలో నిర్మాణాలకు మున్సిపల్ అనుమతులు ఇవ్వలేదని, ఆన్‌ లైన్ ద్వారా కట్కం వీరేందర్ చేసుకున్న దరఖాస్తును రద్దు చేసిందని స్పష్టం చేశారు.

ఆయన కొనుగోలు చేసిన సేల్‌ డీడ్, ఎల్ఆర్‌ఎస్‌ దరఖాస్తులు ఎలాంటి ప్రమాణికం కావని, ఆయన ఓనర్‌ షిప్ చెల్లదని అన్నారు. అదేవిధంగా 2017 నుంచి ఈ భూమిపై కేసు కొనసాగుతుందని, వివిధ కారణాల వల్ల ఆలస్యం జరిగిందన్నారు. అక్రమంగా ఆక్రమణలోకి వచ్చిందే కాకుండా కట్కం వీరేందర్ భూమి తమదే అంటూ గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. సమస్యను పరిష్కరించుకునేందుకు పలు మార్లు చర్చలకు పిలిచిన రావడం లేదని అన్నారు. చట్టంపై ఉన్న నమ్మకంతో వివాదాన్ని న్యాయస్థానంలో తేల్చుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, అబ్దుల్ రజాక్ కుటుంభీకులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ముదిరిన భూవివాదం..!