అడవిలో నాటు తుపాకీ లభ్యం..!
– గ్రామ కార్యదర్శికి అందించిన ఉపాధి కూలీలు
– యాలాల మండలంలో ఆలస్యంగా వెలుగులోకి
– గోప్యంగా ఉంచి విచారణ జరుపుతున్న పోలీసులు
యాలాల, దర్శని ప్రతినిధి: ఉపాధి పనుల కోసం వెళ్లిన కూలీలకు నాటు తుపాకీ(తపంచా) లభ్యమైంది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ యేడాది జనవరి మాసంలో అడాల్‌పూర్ అడవుల్లో బుల్లెట్ మ్యాగ్జిన్ లభ్యమైన విషయం తెలిసిందే. తాజాగా బాణాపూర్ అటవి ప్రాంతంలో నాటు తుపాకీ లభ్యమవడంతో ఆందోళన రేకేత్తుతోంది. గత కొన్ని రోజుల నుంచి బాణాపూర్‌లో జాతీయ ఉపాధి హామి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 16న గ్రామ అటవి ప్రాంతంలో ఉపాధి హామి పనులు చేస్తున్న కూలీలకు నాటు తుపాకీ(తపంచా) లభ్యమైంది. దీంతో వారు గ్రామ కార్యదర్శి రాములుకు అందజేశారు. నాటు తుపాకి తీసుకున్న కార్యదర్శి రాములు మండల అటవీ శాఖ అధికారులకు, యాలాల పోలీసులకు విషయాన్ని తెలిపారు. తన వద్ద తుపాకీని యాలాల పోలీసులకు అప్పగించారు. అయితే విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో యాలాల మండలంలో కలకలం రేపుతోంది. కొన్ని రోజుల క్రితమే నాటు తుపాకీ లభ్యమైనా.. పోలీసులు గోప్యంగా ఉంచి విచారణ చేపడుతున్నట్లు సమాచారం.
అడవుల్లో వేటా..!
యాలాల మండలంలో అటవీ ప్రాంతాలు విస్తారంగా ఉన్నాయి. అడాల్‌పూర్, బాణాపూర్ గ్రామాల సరిహద్దుల్లో ధారూర్ రిజర్వ్ ఫారెస్టు కూడ ఉంది. దీంతో మండలంలోని అటవీ ప్రాంతాల్లో జోరుగా వేట సాగుతున్నట్లు పుకార్లు వినిపిస్తుంటాయి. ఈ అటవి ప్రాంతాలలో దుప్పి, అడవి పందులను వేటాడుతున్నట్లు పుకార్లు ఉన్నాయి.