జిల్లాలో కొత్త పోలీస్టేషన్లు..!
– ఎనిమిదింటి కోసం ప్రతిపాదనలు
– డ్రగ్స్, ఇసుక రవాణాపై ఉక్కుపాదం
– సైబర్ నేరాలపై కళాజాత బృందాలతో అవగాహన
– కరణ్ కోట్ పోలీస్టేషన్ పనితీరు భేష్
– సరిహధ్దులో నేరాల నియంత్రణ చర్యలు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిధిలో కొత్త పోలీస్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం తాండూరు రూరల్ పోలీస్టేషన్ పరిధిలోని కరణ్ కోట్ పోలీస్టేషన్‌ను జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి సందర్శించారు. ఎస్ఐ విఠల్ రెడ్డి, సిబ్బంది ఎస్పీకి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎస్పీ నారాయణ రెడ్డి పోలీస్టేషన్లో రికార్డులను పరిశీలించారు. స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో నేరాల నమోదు శాతం తగ్గిందన్నారు. అదేవిధంగా జిల్లాలో డ్రగ్స్, ఇసుక నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ముఖ్యంగా యువత డ్రగ్, ఆన్ లైన్ గేములకు బానిసలు కాకుండా గ్రామాల్లో కళాజాత బృందాలతో అవగాహన కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. సైబర్ నేరాలుపై అవగాహన కల్పించడం జరగుతుందన్నారు. దీంతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటుపై చైతన్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కొత్త పోలీస్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 8 పోలీస్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు.
మరోవైపు జిల్లాలో సరిహద్దులో ఉన్న కరణ్ కోట్ పోలీస్టేషన్ పనితీరు భేష్ గా ఉందని అన్నారు. సిటీజన్ ఫీడ్ బ్యాక్ సర్వేలో కరణ్ కోట్ పోలీస్టేషన్ రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు పొందడంపై హర్షం వ్యక్తం చేసి.. ఎస్ఐ విఠల్ రెడ్డిని అభినందించారు. క్రైం రేట్ తగ్గుముఖంలో ఉందని అన్నారు. సరిహద్దు ప్రాంతాల నుంచి అక్రమ రవాణా, అసాంఘీక కార్యక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతోపాటు తాండూరు పట్టణంలో ట్రాఫిక్ సిగ్నళ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐఐలు పవన్ కుమార్. రాజశేఖర్, కానిస్టేబుళ్లు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

