సర్వేకు వేళాయే..!

తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

సర్వేకు వేళాయే..!
– రేపటి నుంచే ఇంటింటికి వస్తున్న బృందాలు
– మీ.. ఆస్తులు, అప్పుల వివరాలు నమోదు
– బృందాలకు తెలిజేయాల్సివని ఏంటో తెలుసా..?
– సర్వేలో ఈ పత్రాలు దగ్గురుంచుకోవడం తప్పనిసరి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి సర్వేతో ప్రజల ముందుకు రాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచే సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి సర్వేకు సిద్దమవుతోంది. ఇప్పటికే ఎన్యుమరేటర్లు, సూపర్‌ వైజర్లను నియామకాలు, శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేసి అన్ని ఏర్పాట్లను సిద్దం చేసింది. ఈ క్రమంలో ప్రజలకు సర్వే బృందాలు ఇంటికి వచ్చినప్పుడు ఏం అడుగుతారు.. ఏం సమాధానం చెప్పాలి.. ఏ పత్రాలు దగ్గ పెట్టుకోవాలి..అన్న ప్రశ్నలు అందరిలో మెదులుతున్నాయి. అలాంటి వారికి దర్శిని అందిస్తున్న కథనం.

75 ప్రశ్నలతో.. ఆస్తులు, అప్పుల వివరాలు
సర్వేను ప్రశ్నావళి రూపంలో నిర్వహిస్తారు. ఇందుకు 59 ప్రధాన, 19 అనుబంధం. మొత్తం కలిపి 75 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌-1, పార్ట్‌-2 కింద ఎనిమిది పేజీల్లో సమాచారం సేకరిస్తారు. పార్ట్‌-1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు, సాధారణ విద్య, ఉద్యోగ, ఉపాధి, భూములు, రిజర్వేషన్‌ ప్రయోజనాలు, రాజకీయ వలసల సమాచారం అడుగుతారు. పార్ట్‌-2 కింద కుటుంబ వివరాలు సేకరిస్తారు. ఇందులో 17 ప్రశ్నల్లో ఏడు ప్రధాన ప్రశ్నలు, మిగతా అనుబంధ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అయిదేళ్లలో తీసుకున్న రుణాల వివరాలు, ఏ అవసరం నిమిత్తం తీసుకోవాల్సి వచ్చింది. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో పాల్గొంటే ఆ వివరాలు తీసుకుంటారు. పశుసంపద సంఖ్యను సేకరిస్తారు. స్థిరాస్తి, చరాస్తి వివరాలతో పాటు రేషన్‌కార్డు నెంబరు, ఉంటే నివాస గృహ విస్తీర్ణం, చదరపు గజాల్లో, నివాస రకం, గదుల సంఖ్య, తాగునీటి వనరు, విద్యుత్తు సదుపాయం, మరుగుదొడ్డి వంటకోసం వినియోగించే ఇంధనం వంటి వివరాలు సేకరిస్తారు.
కుటుంబ యజమాని, సభ్యుల పేర్లు, సంబంధం, మతం, సామాజిక వర్గం, వయస్సు, మాతృభాష, ఆధార్‌కార్డు నెంబరు, చరవాణి నెంబరు, దివ్యాంగులైతే వైకల్యం, వైవాహిక స్థితి ఆరా తీస్తారు.
విద్యా వివరాల కింద పాఠశాలలో చేరిన నాటికి వయస్సు, విద్యార్హత, ఏ మాధ్యమంలో చదివారు, బడి మానేస్తే ఆ వివరాలు చెప్పాల్సి ఉంటుంది.
ఉద్యోగ, ఉపాధి వివరాల కింద వృత్తి, ఉద్యోగ, ఉపాధి సమాచారం, వార్షికాదాయం, ఒకవేళ వ్యాపారులైతే వార్షిక టర్నోవర్, సంప్రదాయ కుల వృత్తులైతే వృత్తి కొనసాగిస్తున్నారా.. ఆదాయపన్ను చెల్లింపుదారులా, కాదా.. బ్యాంకు ఖాతా ఉందా.. తదితర వివరాలు తెలుసుకుంటారు.
భూమి వివరాలకు ధరణి పట్టాదార్‌ నెంబర్, భూముల వివరాలు, తరి, మెట్ట, పడావు వంటి భూమి రకం, ఎకరాలు గుంటల రూపంలో ఎన్యుమరేటర్‌కు తెలపాల్సి ఉంటుంది. నీటి పారుదల వనరు, కౌలు భూమి సాగు చేస్తున్నట్లైతే సాగు విస్తీర్ణం వివరాలు సర్వేలో నమోదు చేసుకుంటారు.
ప్రజాప్రతినిధిగా ప్రస్తుతం, గతంలో ఏ పదవిలో ఉన్నారు… పదవీ కాలం, నామినేటెడ్‌ వివరాలు నమోదు చేస్తారు. ఈ ప్రశ్నావళి ప్రజా ప్రతినిధులుగా పనిచేసిన వారికి వర్తిస్తుంది.
విద్య, ఉద్యోగ పరంగా రిజర్వేషన్లు పొందినా, గత అయిదేళ్లలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పథకాలు, వివరాలు నమోదు చేస్తారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ ధ్రువపత్రాలు పొందారా, డీనోటిఫై చేసిన సంచార/ పాక్షిక సంచార తెగకు చెందిన సమాచారాన్ని అవును/కాదు రూపంలో నమోదు చేస్తారు.
కుటుంబ సభ్యులలో ఎవరైనా ఇతర దేశాలు, రాష్ట్రాలకు వలస వెళితే ఆ వివరాలు కూడా నమోదు చేస్తారు. వలస వెళ్లడానికి కారణాలను ఆరా తీస్తారు. సర్వే పూర్తయ్యాక ఇంటికి స్టిక్కర్‌ను అతికిస్తారు.

ఈ పత్రాలను చూపించాలి
ఆధార్‌కార్డులు, రైతులు అయితే ధరణి పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు, రేషన్‌ కార్డు, ఇంటి పన్ను రసీదు, దగ్గర ఉంచుకుంటే ఇంటికి ఎన్యుమరేటర్లు వచ్చినప్పుడు సులువుగా సర్వే పూర్తవుతుంది.
సర్వే సమయంలో ఎలాంటి ఫొటోలు, పత్రాలు తీసుకోరు. కుటుంబ సభ్యులందరూ ఉండాల్సిన అవసరం లేదు. కుటుంబ యజమాని ఉండి ఆయా వివరాలు చెబితే సరిపోతుంది. ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.

ఇదికూడా చదవండి…

పేకాట స్థావరాలపై ఉక్కుపాదం..!