రెండో పెళ్లి చేసుకున్న భర్తకు జరిమాన, జైలు శిక్ష
– తీర్పు వెలువరించిన తాండూరు న్యాయమూర్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మొదటి భార్య అంగీకారం లేకుండా రెండో పెళ్లి చేసుకున్న ఓ భర్తకు జరిమానతో పాటు జైలు శిక్ష విధిస్తూ తాండూరు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్లు పట్టణ ఎస్ఐ గిరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేసుకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం దామర్ చెడ్ గ్రామానికి చెందిన జోగి సునీతకు అదే గ్రామానికి చెందిన తిరుపతయ్యతో వివాహాము జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కొన్నాళ్ల తరువాత తిరుపతయ్య భార్యను వేధించే వాడు. అదే సమయంలో అదే గ్రామానికి చెందిన ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని వివాహం చేసుకొని ఆమెతో కాపురం పెట్టాడు. దీంతో సునీత 2013లో వికారాబాద్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో జోగి సునీత భర్తతో పాటు రెండవ భార్యపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పటి ఇనుస్పెక్టర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నమోదు చేసిన చార్జిషీట్‌ను తాండూర్ కోర్టులో ఫైల్ చేశారు. మంగళవారం కేసు వాదనలు విన్న తాండూర్ న్యాయమూర్తి టీ.స్వప్న నేరస్తునికి రూ. 5 వేల రూపాయల జరిమానతో పాటు 20 రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించినట్లు ఎస్ఐ గిరి తెలిపారు.


