కారులో క్లోరల్ హైడ్రేట్ రవాణా..!
– తనిఖీల్లో 20కేజీల మత్తు ప్యాకెట్ల స్వాదీనం
– గుట్టును రట్టు చేసిన టాస్క్ ఫోర్స్, పోలీసులు
– కల్తీకల్లు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవు
– హెచ్చరించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : కల్తీ కల్లు తయారుకు ఉపయోగించే క్లోరల్ హైడ్రేట్(సీహెచ్) రవాణా చేస్తున్న నిందితున్ని టాస్క్ ఫోర్స్, సివిల్ పోలీసులు పట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం విశ్వనీయ సమాచారంతో జిల్లాలోని కోడంగల్ చౌరస్తాలో టాస్క్ ఫోర్స్, కోడంగల్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ స్విప్ట్ కారు వేగంగా దూసుకోస్తూ ఆపకుండా వెళ్లేందుకు యత్నిస్తుండగా పోలీసులు దానిని అడ్డుకుని ఆపేశారు. కారులో డ్రైవర్‌ను విచారించగా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండల కేంద్రానికి చెందిన శ్రీకాంత్ గౌడ్‌గా గుర్తించారు. అతని కారులో తనిఖీలు చేపట్టగా 10కిలోల సీహెచ్ లభించింది.
అదుపులోకి తీసుకుని విచారించగా కర్ణాటక రాష్ట్రం చించొల్లిలో నివాసం ఉంటున్న బషీరాబాద్ గ్రామానికి చెందిన మేఘనాథ్ గౌడ్ వద్ద కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకోగా చితాపూర్‌కు చెందిన ఉష్ణయ్య గౌడ్ వద్ద తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో సోదాలు నిర్వహించి మేఘనాథ్ గౌడ్ వద్ద 5కేజీలు, ఉష్ణయ్య గౌడ్ వద్ద 5 కేజీలు స్వాదీనం చేసుకున్నారు. దీంతో శ్రీకాంత్ గౌడ్ వద్ద లభించిన 10కిలోలతో పాటు మేఘనాథ్ గౌడ్, ఉష్ణయ్యల వద్ద లభించిన 10కిలోలు మొత్తం 20కిలోల సీహెచ్‌ను స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 60వేలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఈ మేరకు నిందితులపై కోడంగల్ పోలీస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మరోవైపు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ సీహెచ్ వినియోగం వల్ల మనషులపై అనేక దుష్ప్రభావాలు చూపుతాయన్నారు. మత్తు కల్గించడమే కాకుండా, మెదడు, ఇతర శరీర బాగాల మీద ప్రభావం చూపి అనారోగ్యం కల్పించడం జరుగుతుందన్నారు. డ్రగ్స్ మాదిరిగా ఓ వ్యసనంగా మారుతుందన్నారు. కావున ప్రజలు కల్తీకల్లు సేవించరాదని సూచించారు. ఎవరైనా కల్తీ కల్లు తయారు చేస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలని సూచించారు. నిందితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదికూడా చదవండి…

