పాత కుంటలో మురుగు వివాదం…!
– పారే కాలువను మూసిన కౌన్సిలర్
– మురుగు నీరు పారక స్థానికుల గగ్గొలు
– ఏఎంసీ చైర్మన్, వార్డు కౌన్సిలర్ చొరవతో కాలువ పునరుద్దరణ
– మున్సిపల్ అధికారుల సమక్షంలో పూడిక తీత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి ఆదర్శనగర్ పాతకుంటలో మురుగు కాలువ విషయంలో వివాదం చోటు చేసుకుంది. తన సొంత స్థలం అంటూ కౌన్సిలర్ కాలువను వ్యర్థాలతో మూసివేశారు. మురుగు పారకపోవడంతో స్థానికుల ఇళ్లమద్య నీరు నిలిచిందని గగ్గోలు పెట్టారు. ఈక్రమంలో స్థానికులకు కౌన్సిలర్ మద్య వాగ్వివాదం జరిగింది. విషయం తెలుసుకున్న తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ నీరజాబాల్ రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని చొరవ చూపడంతో అధికారులు కాలువను పూడిక తీసి పునరుద్దరణ పనులు చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఆదర్శనగర్‌లో మున్సిపల్ కౌన్సిలర్, విద్యావేత్త విజయాదేవికి సర్వేనెంబర్ 95, 96, 114, 115లలో భూమి ఉంది. ఈ భూమికి అనుకునే మురుగు కాలువ ఉంది.
ఆదర్శనగర్, పాతకుంటకు చెందిన ఇండ్ల నుంచి నీరు ఈ మురుగు కాలువ నుంచి ప్రవహిస్తుంది. అయితే కౌన్సిలర్ విజయాదేవి తన సొంత స్థలం అంటూ పారుతున్న మురుగు కాలువను గురువారం రాత్రి నాపరాతి వ్యర్థాలతో మూసి వేశారు. శుక్రవారం ఉదయం నుంచి మురుగు పారక స్థానికుల ఇండ్ల మద్య నీరు నిలిచిపోయింది. గమనించిన స్థానికులు కౌన్సిలర్ విజయాదేవితో వాదనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
గత కొన్నేళ్ల నుంచి ఇదే మార్గంలో మురుగు కాలువ ఉండేదని అధికారులకు వివరించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా మురుగు కాలువ అభివృద్ధికి నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. దీంతో మున్సిపల్ అధికారులు జేసీబీని తెప్పించి మురుగు కాలువ పూడిక తీత పనులు చేపట్టారు. ఈ క్రమంలో కౌన్సిలర్ విజయాదేవి మార్కెట్ కమిటి చైర్మన్ బాల్ రెడ్డి, కౌన్సిలర్ నీరజాబాల్ రెడ్డిలతో వాగ్వివాదం చేశారు. అయితే మున్సిపల్ కమిషనర్ మాత్రం పూడిక తీత పనులు ఆపవద్దని, ఏమైనా ఉంటే చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుందామని నచ్చజెప్పారు. దీంతో వివాదం చల్లారింది. మురుగు కాలువ పూడిక పనులు చేపట్టడంతో స్థానికులు ఉపశమనం పొందారు.
ఇదికూడా చదవండి…

