చోరీకి వెళ్లి నిద్రపోయిన దొంగ..!

క్రైం జాతీయం తెలంగాణ హైదరాబాద్

చోరీకి వెళ్లి నిద్రపోయిన దొంగ..!
– మద్యం మత్తులో దొంగకు పరాభవం
– పోలీసులకు అడ్డంగా దొరికిన వైనం  
– సోషల్ మీడియాలో వైరల్
దర్శిని డెస్క్ : అర్దరాత్రి దొంగతానికి వెళ్లిన ఓ దొంగ మద్యం మత్తులో నిద్రలోకి జారుకోవడంతో తెల్లారీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని అమింజకరై నెల్సన్‌ మాణిక్కంసాలైలో నెల్సన్ మాణికం రోడ్‌లో ఓ బ్యూటీపార్లర్‌ ఉంది. రాత్రి పార్లర్‌కి తాళం వేసి అక్కడి సిబ్బంది వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా తలుపులు బార్లా తెరచి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. లోనికెళ్లి చూడగా వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ల్యాప్‌టాప్‌ చోరీకి గురైనట్లు గుర్తించారు. ఇంతలో పార్లర్‌ మేడపై నుంచి గురక శబ్దం రావడం గమనించి.. అంతా పైకెళ్లి వెళ్లారు. అక్కడి దృశ్యం చూసి అంతా నోరెళ్లబెట్టారు.మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు హాయిగా నిద్రపోతుండటం వారి కంటపడింది. దీంతో పోలీసులు అతన్ని నిద్ర లేపి పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. పోలీసుల దర్యాప్తులో.. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి పుల్‌పురానికి చెందిన శ్రీధర్‌ (24)గా తేలింది.

అనంతరం అతని వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కి తరలించారు. నిందితుడు శ్రీధర్‌పై అమింజికరై, మీనంబాక్కంలోని పోలీస్‌ స్టేషన్లలో పలు నేరాలకు సంబంధించి కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు ఆదివారం మీడియాకు తెలిపారు. ఈ విచిత్ర ఘటన తమిళనాడులో గత శుక్రవారం చోటు చేసుకోగా శనివారం ఉదయం (డిసెంబర్‌ 28) వెలుగులోకి వచ్చింది.

ఇదికూడా చదవండి…

మిస్సింగ్ మిస్టరీ..!