అప్పులున్నా.. ఆగేది లే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అప్పులున్నా.. ఆగేది లే..!
– ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం
– భూమిలేని రైతులకు రైతు భరోసా చారిత్రాత్మకం
– సంక్రాంతి తరువాత అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు
– ఏడాదిలో.. మాటలు కాదు చేతల్లో చూపించాం
– తాండూరు నియోజకవర్గ అభివృద్ధే మొదటి ఎజెండా
– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : గత ప్రభుత్వం అప్పులు మూట ఇచ్చినా… రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభంతో అడ్డంకులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుడి సంక్షేమాన్ని ఆపకుండా.. ఆగకుండా ముందుకు సాగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం పెద్దేముల్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈనెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలు చారిత్రాత్మకమని అభివర్ణించారు. అన్ని వర్గాలతో పాటు రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, క్యాబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈనెల 26న ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ పథకాన్ని అమలు చేయబోతుందని, దేశంలో మొట్టమొదటిసారిగా భూమి లేని రైతు కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా నెలకు 12 వేల రూపాయలు ఇవ్వడం ప్రజా ప్రభుత్వంలో చారిత్రాత్మకమైన నిర్ణయమన్నారు. అన్నదాతలకు మేలు చేయాలనే ఉద్దేశంతో సబ్సిడీ, రాయితీపై పని ముట్లు ఇచ్చే పథకం తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామని అన్నారు. గతంలో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. కాంట్రాక్టర్లుకు బిల్లులు చెల్లించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.

కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమానికి అడ్డంకులు సృష్టిస్తూ.. ప్రజా పాలనపై దుష్ప్రచారాలు చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక సంక్షోభం ఉన్నా,.. అప్పులు ఉన్న సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారేంటిలు అమలు చేసి తీరుతామని అన్నారు. ఏడాది పాలనలో మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించామని అన్నారు.

తాండూరు అభివృద్ధే నా లక్ష్యం
తాండూరు ఎమ్మెల్యేగా పదవులపై ఎలాంటి తాపత్రయం లేదని చెప్పుకొచ్చారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ తాండూరు రోడ్డు పనులు ప్రారంభం కాగా, అన్ని మండలాల నుంచి నియోజకవర్గ కేంద్రానికి రానున్న రోడ్లను సంవత్సరంలోపు పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయిస్తామన్నారు. గతంలో ITI కళాశాల మంజూరు చేసి నమ్మిస్తే.. మా ప్రభుత్వంంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా మార్చి వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఆధునాతన కోర్సులలో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు.

తాండూరులో ఉన్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని పాలిసింగ్ యూనిట్లను పట్టణం బయటకు తరలిస్తున్నామని అన్నారు. జీన్గుర్తిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు గత ప్రభుత్వం భూ సేకరణ చేసిన పనులు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంబడి శరవేగంగా ఇండస్ట్రియల్ పార్క్ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా వచ్చే రెండు సంవత్సరాల్లో తాండూర్ మున్సిపాలిటీ ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తాండూరులో పూర్తిగా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. పెద్దేముల్ మండలం గొట్లపల్లి మోడల్ స్కూల్ ను విద్యార్థుల అవసరం నిమిత్తం అప్గ్రేడ్ చేస్తూ హాస్టల్ వసతి కల్పించడం జరిగిందన్నారు.

30 సంవత్సరాలుగా బషీరాబాద్ మండలంలోని నీలపల్లి, జలాల్పూర్, మైల్వర్ అటవీ భూముల సరిహద్దు సమస్యను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఎమ్మెల్యేగా గెలిచిన వెంబడి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో సమన్వయం చేస్తూ అటవీ భూమి సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. రైతులకు వ్యవసాయ సహకార సంఘాల సేవలు మరింత వేగంగా సులభతరం చేయటానికై మంబాపూర్, కాసింపూర్, పగిడ్యాల్, కరణ్ కోట్ లలో నూతన సొసైటీల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు.

ఎమ్మెల్యేతో కలిసి నేతల సంబరాలు
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో పెద్దేముల్ మండల నాయకులు సంబరాలు జరుపుకున్నారు. దీంతో పాటు రైతు భరోసా అమలుకు నిర్ణయం తీసుకోవడం పట్ల బాణాసంచా కాల్చి, మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయాకులు ఉత్తమ్ చంద్, డా.సంపత్ కుమార్, జిల్లా మహిళ అధ్యక్షురాలు శోభరాణి, నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఉసిరి జ్యూస్‌.. వెరీ బెస్ట్..!