వార్డు సభలో భగ్గుమన్న విభేదాలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వార్డు సభలో భగ్గుమన్న విభేదాలు..!
– కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కౌన్సిలర్‌ వాగ్వివాదం
– అభివృద్ధి, కబ్జాలు, ప్రోట్రోకాల్ విషయంలో రగఢ
– కాంగ్రెసోళ్లు దొంగలు అంటూ కౌన్సిలర్ ఆగ్రహం
– తాండూరు గ్రీన్‌సీటీలో గందరగోళంగా సభ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్య విభేదాలు భగ్గుమన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన వార్డు సభ ఇందుకు వేదికైంది. సభలో కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ కౌన్సిలర్ మద్య వాగ్వివాదం ఉద్రిక్తతను తలపించింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ ‘కాంగ్రెసోళ్లు దొంగలు’ అంటూ ఫైర్ అయ్యారు. ఈ సంఘటన తాండూరు మున్సిపల్ పరిధి 13వ వార్డులో జరిగింది. కొత్త సంక్షేమ పథకాల అమలుకు అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం వార్డు సభలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

రెండో రోజు బుధవారం తాండూరు పట్టణంలోని 13వ వార్డులో వార్డు సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, వార్డు కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి(బీఆర్ఎస్)లతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటి చైర్మన్‌ బాల్ రెడ్డి, చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌లు ప్రసంగించారు. బీఆర్ఎస్ హాయాంలో వార్డు అభివృద్ధి చెందలేదని, కాంగ్రెస్ వచ్చాకా వార్డుకు నిధులు కేటాయించడం జరిగిందని చెప్పుకొస్తూ చిలక వాగు కబ్జా, ఎమ్మెల్యే సహాకారంతో కృషి చేయడం జరుగుతుందని మాట్లాడారు. ఇందుకు కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి అభ్యంతరం తెలిపి వాఖ్యలను ఖండించారు.

అదేవిధంగా వార్డులో ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు, కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి మద్య వాదులాట జరిగింది. కౌన్సిలర్‌గా చిలుక వాగును అభివృద్ధి చేస్తే దొంగతనంగా బిల్లులు లేపుకున్నారని, కాంగ్రెస్ వాళ్లు దొంగలు అంటూ ఫైర్ అయ్యారు. అంతటితో ఆగకుండా తన వార్డులో కబ్జాలు జరగలేదని, ఎక్కడ ఎవ్వరు చేశారో చూపించాలని డిమాండ్ చేశారు. ఓ వార్డు కన్నా.. తన వార్డులోనే అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్‌ వార్డులో రోడ్డు వేసుకోలేకపోయారని విమర్శించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

చైర్ పర్సన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో వార్డు అభివృద్ధికి రూ. 50లక్షల నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. మార్కెట్ కమిటి చైర్మన్ బాల్ రెడ్డి మాట్లాడుతూ చిలకవాగు అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టరుకు నిబంధనల ప్రకారం బిల్లులు చెల్లించడం జరిగిందని కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి చేసిన ఆరోపణలకు సవాల్ జవాబుకు ఇచ్చారు. అక్కడే ఉన్న మున్సిపల్ కమీషనర్, కాంగ్రెస్ నేతలు, పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

ఇదికూడా చదవండి…

మీ రూ. 500 నోటు నిజమైందేనా…?