ఉచిత రేష‌న్ ఈనెల వ‌ర‌కే..!

తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్

ఉచిత రేష‌న్ ఈనెల వ‌ర‌కే..!
– వ‌చ్చే నెల నుంచి య‌ధాత‌ధం
– పీఎంజీకేవైను మూసివేస్తున్న కేంద్రం
ఉమ్మ‌డి రంగారెడ్డి, ద‌ర్శ‌ని ప్ర‌తినిధి: కేంద్రం ప్ర‌భుత్వం ల‌బ్దిదారుల‌కు అందిస్తున్న ఉచిత రేష‌న్ పంపిణీ ఈనెల‌తో ముగిసిపోతుంది. వ‌చ్చే నెల నుంచి య‌ధావిధిగా రేష‌న్ పంపిణీ జ‌ర‌గనుంది. కరోనా వైరస్ మొదటి ద‌శ‌, రెండో ద‌శ‌లో విధించిన దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ కార‌ణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ఆర్థికంగా చితికిపోయారు. దినసరి కూలీల నుంచి చిరు వ్యాపారుల వరకు అందరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్ర‌మంలో చాలామంది తినడానికి తిండిలేని పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం స్పందించి “ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన”ను
పథకాన్ని ప్రారంభించింది. ఈ ప‌థ‌కంతో ఎంతో పేద‌ల‌కు ఉచితంగా రేష‌న్ బియ్యం పంపిణీ చేసింది. గ‌త మూడు నెలలుగా కేంద్రం త‌న వాటా కింద 5కిలోలు, రాష్ట్రం వాటా కింద మ‌రో 5కిలోల చొప్పున ప్ర‌తి ఒక్క‌రికి 10 కిలోల చొప్పున ఉచిత రేష‌న్‌ను పంపిణీ చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం పీఎంజీకేవై ద్వారా దాదాపు 80 కోట్ల మంది ల‌బ్దిపొందిన‌ట్లు అంచ‌నా వేశారు. రంగారెడ్డి జిల్లాలో 17,44,464 మంది లబ్ధిదారులు, వికారాబాద్ జిల్లాలో 8లక్షల మందికి ఉచిత బియ్యంను అందుకున్నారు. ఇదిలా ఉండ‌గా కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేసిన పీఎంజీకేవై ప‌థ‌కం నెల‌తో ముగిసిపోతోంది. పథకం దీపావళి వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఈ పథకాన్ని మూసివేస్తారు. తర్వాత దేశంలోని రేషన్ కార్డు హోల్డర్లందరికీ మునుపటిలాగే ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తారు.