ఫించన్ డబ్బుల కోసం పాపం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఫించన్ డబ్బుల కోసం పాపం..!
– నాన్నమ్మపై దాడి చేసిన మనుమడు
– కేసు నమోదు, రిమాండుకు తరలింపు
– వివరాలు వెల్లడించిన కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : నాన్నమ్మ ఫించన్ డబ్బుల కోసం ఓ మనుమడు పాపం చేశాడు. డబ్బులు ఇవ్వలేదని తలపై దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటనలో నిందితుడుపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో కేసు వివరాలను వెల్లడించారు. తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన బైరంపల్లి మాణెమ్మను ఆమె పెద్ద కుమారుడు సుధాకర్‌ కొడుకు నరేష్‌ ఫించన్ డబ్బుల కోసం వేధించే వాడు. కొంత కాలం నుంచి ఇదేవిధంగా వేధిస్తున్నాడు.

తాజాగా శుక్రవారం ఉదయం మాణెమ్మను మనుమడు నరేష్‌ ఫించన్ డబ్బులు ఇవ్వాలని వేధించాడు. మాణెమ్మ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో కోపంతో నరేష్ ఇంట్లో ఉన్న ఇనుపరాడు తీసుకుని ఆమె తలపై, వీపులపై దాడి చేశాడు. తలకు రక్తగాయాలు కావడంతో కిందపడిపోయింది. చుట్టుపక్కల వారు గమనించి విడిపించారు. నరేష్‌ను పట్టుకునేందుకు యత్నించగా వదిలించుకుని పారిపోయాడు. గాయపడిన మాణెమ్మను చికిత్స నిమిత్తం తాండూరులోని ఆసుపత్రికి తరలించారు. మాణెమ్మ చిన్న కుమారుడు వెంకటప్ప ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించినట్లు వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

యువకుడికి కృత్రిమ పురుషాంగం..!