కొడుకుతో పాటే.. తండ్రి..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కొడుకుతో పాటే.. తండ్రి..!
– చికిత్స పొందుతూ తండ్రి కన్నుమూత
– చెంగోల్ రోడ్డు ప్రమాదంలో విషాధం
– దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో జరిగిన లారీ, స్కూటీ యాక్సీడెంట్లో మరో విషాధం నెలకొంది. తండ్రీ కొడుకులు వెళుతున్న స్కూటీని లారీ ఢీ కొనడంతో కుమారుడు అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన తండ్రిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొడుకుతో పాటు తండ్రీ కూడా మృతి చెందడంతో ఈ సంఘటన వారి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన ఈడిగి నర్సింలు(35) తండ్రి గోపయ్య అనారోగ్యానికి గురికావడంతో శుక్రవారం తాండూరులోని ఆసుపత్రిలో చూపించుకుని తిరిగి బయల్దేరాడు. చెంగోల్ సమీపంలోని బై పాస్ రోడ్డు సమీపంలో ఓ లారీ(టీఎస్34 టీబీ0118) వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింలు స్కూటీ పైనుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గోపయ్యకు గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 108 సహాయంతో నర్సింలు మృతదేహాన్ని, తండ్రి గోపయ్యను తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. నర్సింలు మృతదేహాన్ని మార్చురికి తరలించారు.

గోపయ్యను పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించాలని సూచించడంతో కుటుంభీకులు పట్టణంలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో గోపయ్యను తిరిగి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తండ్రి గోపయ్య గౌడ్ కూడా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒకే రోజు కుమారుడు మృతి చెందిన గంటల వ్యవధిలోనే తండ్రి కూడా మృతి చెందడంతో ఇద్దరు పెద్ద దిక్కులను కోల్పోయిన కుటుంబం రోడ్డున పడ్డట్టు అయ్యింది.

దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
కుమారుడు, తండ్రీ మృతి చెందిన సంఘటనపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం పరంగా కుటుంబానికి అందాల్సిన ఆర్థికపరమైన సాయం అందేలా చూస్తామని ప్రకటించారు. మరోవైపు శుక్రవారం రోజే సాయంత్రం చెంగోల్ గ్రామంలో తండ్రీ,కొడుకుల అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.

ఇదికూడా చదవండి…

ప్రతి ఒక్కరు దైవ మార్గంలో నడవాలి..!